మేడిగడ్డ పైన మరో విచారణకు డిమాండ్
x

మేడిగడ్డ పైన మరో విచారణకు డిమాండ్

కాంగ్రెస్ పార్టీ కుట్రల వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగినట్లు కేటీఆర్ ఆరోపించారు


మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై మరో విశ్రాంత జడ్జితో మళ్ళీ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడుతు రు. 3800 కోట్లతో కట్టిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవటంపై అనేక అనుమానాలు వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ కుట్రల వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగినట్లు కేటీఆర్ ఆరోపించారు. చెక్ డ్యాములను బాంబులతో కాంగ్రెస్ పార్టీ నేతలు పేల్చుతున్నారు అని ఆరోపించారు. ఇదేపద్దతిలో బీఆర్ఎస్ హయాంలో కూడా మేడిగడ్డ పిల్లర్లను కాంగ్రెస్ నేతలే పేల్చేసుంటారనే అనుమాన్ని వ్యక్తంచేశారు. అందుకనే మరో విశ్రాంత జడ్జీతో మళ్ళీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కుంగింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వంచేసిన కుట్రలే అని ఎద్దేవాచేశారు. ఈరోజు గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్లు అన్నారు. మూడేళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై చేసిన దుష్ప్రచారమంతా హైకోర్టు తీర్పుతో తప్పని తేలిపోయింది అన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రచారంతో ప్రత్యర్ధులను గుక్కతిప్పుకోనీకుండా దాడిచేయటంలో బీఆర్ఎస్ ను మించిన పార్టీలేదనే చెప్పాలి. కేటీఆర్, హరీష్ అందరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో హైకోర్టు కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా నానా హడావుడి చేస్తున్నారు. నిజానికి కోర్టు వీళ్ళకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ తీరును మాత్రమే తప్పుపట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కాని జరగలేదని కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంతోటిదానికి కోర్టు తమకు క్లీన్ చిట్ ఇచ్చిందన్నట్లుగా ప్రచారం చేసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

నిజానికి కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టు, బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లలో కొన్ని కుంగిపోవటం, ఫలితంగా బ్యారేజీ ప్లాట్ ఫామ్ కు చాలాచోట్ల పగుళ్ళు రావటం అందరికీ తెలిసిందే. ఏ స్ధాయిలో అవినీతి జరిగితే అంతలావు పిల్లర్లు కుంగిపోయి నెర్రెలు వచ్చేస్తాయి. డ్యామ్ ప్లాట్ ఫామ్ కు పగుళ్ళు వచ్చేసింది కాబట్టి నీటి వాడకానికి మేడిగడ్డ పనికిరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి తేల్చిచెప్పింది. వాస్తవం ఇలాగుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం పూర్తి విరుద్ధంగా ప్రచారం చేసుకుంటున్నారు.

ఇక మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవటానికి కారణం నీటి ప్రవాహానికి ఇసుకు కొట్టుకునిపోయినపుడు పిల్లర్లు మరింత లోపలికి కుంగిపోవటమే అని ఇరిగేషన్, ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి నిపుణులు కూడా ఇదే తేల్చారు. దీనికి కాంగ్రెస్ కు ఏమి సంబంధం ? ప్రాజెక్టు నిర్మితమైంది కేసీఆర్ హయాంలో, కుంగిపోయింది కూడా కేసీఆర్ హయాంలోనే. అలాంటపుడు నాసిరకం నిర్మాణాలకు బాధ్యత వహించాల్సింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే కదా. అయితే పిల్లర్లను కాంగ్రెస్ నేతలు బాంబులతో పేల్చేశారని ఆరోపణలు చేయటం, అనుమానాలు వ్యక్తంచేయటం కేటీఆర్ కే చెల్లింది. ఈ మాటను ఇపుడే కాదు కేటీఆర్ చాలాకాలంగా చెబుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎవరినీ ప్రాజెక్టుల దరిదాపుల్లోకి కూడా వెళ్ళనీయలేదు. అలాంటిది కాంగ్రెస్ నేతలు బాంబులతో ఎలా పేల్చగలరు ? కేటీఆర్ డిమాండ్ చేస్తున్నట్లుగా రేవంత్ ప్రభుత్వం మరో విశ్రాంత జడ్జీతో విచారణ చేయిస్తుందేమో చూద్దాం.

Read More
Next Story