కేటీఆర్ కు ఏసీబీ స్పెషల్ కోర్టు షాక్
ఛార్జిషీటులోని అరోపణలు, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రత్యేక కోర్టు జడ్జి కేసును విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ ప్రత్యేక న్యాయస్ధానం షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ దాఖలుచేసిన ఛార్జిషీటును అనుమతిస్తు విచారణకు స్వీకరించినట్లు చెప్పింది. మొదటి విచారణ శుక్రవారం ప్రారంభమై తర్వాత విచారణ ఆగస్టు 25వ తేదీకి వాయిదాపడింది. ఈ రోజు జరిగిన విచారణకు కేటీఆర్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి కూడా నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు.
2023లో ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ పేరుతో కేటీఆర్ అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేయించింది. ఏసీబీతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్ధ ఈడీ కూడా ఆరోపణలపై దర్యాప్తుచేసింది. కేటీఆర్ వల్ల ప్రభుత్వానికి సుమారు 55 కోట్లు నష్టం జరిగిందని ఛార్జిషీటులో ఏసీబీ పేర్కొన్నది.
కార్ రేసు పేరుతో ఆర్ధికశాఖ, క్యాబినెట్, ఎన్నికల కమిషన్, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే కేటీఆర్ ఒత్తిడి కారణంగానే హెచ్ఎండీఏ ఖాతా నుండి బ్రిటన్ లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఖాతాకు కోట్లాది రూపాయలు బదిలీ జరిగిందని ఏసీబీ ఛార్జిషీటులో పేర్కొన్నట్లు సమాచారం. ఛార్జిషీటులోని అరోపణలు, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రత్యేక కోర్టు జడ్జి కేసును విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.
తనమీద నమోదైన కేసును కొట్టేయాలన్న కేటీఆర్ వాదనను తోసిపుచ్చి కేసు విచారణను మొదలుపెట్టడంతో తర్వాత విచారణలో కేటీఆర్‌కు ఏమవుతుందో అనే టెన్షన్ బీఆర్ఎస్ వర్గాల్లో పెరిగిపోతోంది.

