
రైతులపైకి భూసమీకరణను ప్రయోగించబోతున్న రేవంత్ ప్రభుత్వం
ప్రిస్టేజియస్ ప్రాజెక్టులకు అవసరమైన భూములకోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులపై భూసమీకరణ ప్రక్రియను ప్రయోగించే ఆలోచనలో ఉన్నది. శంషాబాద్ సమీపంలోని బహదూర్ గూడలో బుల్లెట్ రైలు కారిడార్, మెట్రో ప్రాజెక్టుల కోసం ప్రభుత్వానికి 650 ఎకరాలు అవసరం అయ్యాయి. ఈ భూములను భూసేకరణ పద్దతిలో కాకుండా భూసమీకరణ పద్దతిలో సేకరించాలని ప్రభుత్వం అనుకున్నది. ఎందుకంటే భూసేకరణ-2013 చట్టం ప్రకారం రైతులకు భారీగా పరిహారం ఇవ్వాల్సుంటుంది. తీసుకున్న భూమికి మార్కెట్ ధర ప్రకారం నాలుగురెట్లు అదనంగా ప్రభుత్వం భూ యజమానులకు చెల్లించాల్సుంటుంది. అందుకనే భూసేకరణకు బదులు భూసమీకరణ పద్దతిని అనుసరించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. భూసమీకరణ పద్దతిలో రైతుల నుండి భూములు తీసుకోవాలని అనుకుంటున్న ప్రభుత్వం పరిహారం బదులుగా ప్రాజెక్టుల కోసం భూములను డెవలప్ చేసిన తర్వాత అందులో నుండే భూ యజమానులకు సుమారు 300 గజాల స్ధలం ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో భూసమీకరణపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఇదే విషయమై వ్యవసాయ శాస్త్రవేత్త జీవీ రామాంజనేయులు మాట్లాడుతు భూసమీకరణ ప్రక్రియతో రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఛత్తీస్‌ఘడ్ లో నయా రాయిపూర్, అమరావతి లాంటి ప్రాంతాల్లో లాండ్ పూలింగ్ పద్దతిలో భూములు తీసుకున్నా ఎలాంటి అభివృద్ధి జరగని విషయాన్ని గుర్తుచేశారు. అలాగే దీని గురించి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి ‘ఫెడరల్’ తో మాట్లాడారు.
అయితే రియాల్టర్ కృష్ణకుమారి మాట్లాడుతు భూ సమీకరణ చట్టం ఆహ్వానించదగినదే అని చెప్పారు. ప్రక్రియ వల్ల ప్రభుత్వంపై ఆర్ధికభారం తగ్గటమే కాకుండా రైతులకు డెవలప్ అయిన భూమి దక్కుతుందని అన్నారు.

