రేవంత్ ప్రభుత్వానికి లీగల్ నోటీసా ?
x
Annaram barrage and Revanth

రేవంత్ ప్రభుత్వానికి లీగల్ నోటీసా ?

ప్రభుత్వం ఫైనల్ బిల్లు ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతున్నట్లు లీగల్ నోటీసులో కాంట్రాక్ట్ సంస్ధ తీవ్రమైన ఆరోపణలు గుప్పించిందనే ప్రచారం పెరిగిపోతోంది


పనులు పూర్తయినా బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోందనే ఆరోపణతో ఒక కాంట్రాక్ట్ సంస్ధ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లీగల్ నోటీసు పంపిందనే ప్రచారం సంచలనంగా మారింది. చేసిన కాంట్రాక్ట్ బిల్లులో ప్రభుత్వం ఫైనల్ బిల్లు ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతున్నట్లు లీగల్ నోటీసులో కాంట్రాక్ట్ సంస్ధ తీవ్రమైన ఆరోపణలు గుప్పించిందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలు నిర్మాణమైన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు బ్యారేజీలను ఎల్ అండ్ టీ సంస్ధతో పాటు మరికొన్ని నిర్మాణ సంస్ధలు నిర్మించాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు బ్యారేజీలు కూడా దెబ్బతిన్నాయని ప్రభుత్వం కాంట్రాక్టు సంస్ధలను బాధ్యులను చేస్తున్నది.

ప్రాజెక్టు నిర్మాణం నాసిరకంగా జరిగింది కాబట్టి వాటికి మరమ్మతుల బాధ్యత కాంట్రాక్టు సంస్ధలదే అని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. మరమ్మతులకు నిర్మాణ సంస్ధలు ముందుకురాకపోతే కఠినచర్యలు తీసుకోవటానికి కూడా వెనకాడేది లేదని ఇప్పటికే రేవంత్ చాలాసార్లు వార్నింగులిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో మరమ్మతు పనులను వెంటనే మొదలుపెట్టాలని ఉన్నతాధికారులు నిర్మాణ సంస్ధలకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ‘‘2019లోనే బ్యారేజీ నిర్మాణం పూర్తయింది అంతా సవ్యంగానే ఉందని ఇంజనీర్లు ధ్రువీకరణ పత్రాలు కూడా ఇచ్చారు, ఒప్పందం ప్రకారం లయబులిటి పీరియడ్ నిర్వహణ గడువు కూడా ముగిసినా ప్రభుత్వం మాత్రం పెండింగ్ బిల్లులు సెటిల్ చేయలేదు’’ అని ఆప్కాన్స్-విజేత-పీఈఎస్ భాగస్వామ్య సంస్ధ ప్రభుత్వానికి లీగల్ నోటీసు జారీచేసింది.

2023 ఆగస్టు నుండి పెండింగులో ఉన్న రు. 176.5 కోట్లు వెంటనే చెల్లించాలంటు సదరు భాగస్వామ్య సంస్ధ ప్రభుత్వానికి పంపిన లీగల్ నోటీసులో స్పష్టంగా చెప్పింది. ఏ కారణం వల్లయినా పెండింగ్ బిల్లు చెల్లించలేకపోతే 2026 ఆగస్టు 23 నుండి 12శాతం వడ్డీతో చెల్లించాల్సుంటుందని కూడా బెదిరింపు లాంటి వార్నింగ్ ఇవ్వటం ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. వెంటనే డబ్బులు చెల్లించకపోతే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించటం ఆశ్చర్యంగా ఉంది.

అన్నారం బ్యారేజీ నిర్మాణానికి 2016 ఆగస్టు 26న రు. 1451.81 కోట్లతో ప్రభుత్వం పైన చెప్పిన భాగస్వామ్య సంస్ధలతో ఒప్పందం చేసుకుంది. 2019 నాటికి పనులు కూడా పూర్తయిపోయాయి. 2019, జూలై 21న బ్యారేజీని కేసీఆర్ ప్రారంభించారు. పనులు అయిపోయినట్లుగా సర్టిఫికేట్ ఇవ్వాలని సంస్ధ కోరగా డిసెంబర్ 17న పనులు పూర్తయినట్లు ఇంజనీర్లు సర్టిఫికేట్ జారీచేశారు. అప్పటి నుండే డిఫెక్ట్ లయబులిటి పీరియడ్ మొదలైంది. బ్యారేజీ నిర్మాణం పూర్తయినపుడు ఇంజనీర్లు తనిఖీలు చేసారు. లోపాలున్నట్లు ఇంజనీర్ల నుండి ఒక్క అభ్యంతరం కూడా రాలేదని సంస్ధ చెబుతోంది. 2020, జనవరిలో ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని సవరించి రు. 2,734.81 కోట్లకు మళ్ళీ అనుమతిచ్చింది. 2021 డిసెంబర్ 17 నుండి 2024 డిసెంబర్ 16 వరకు నిర్వహణ ఒప్పందం 2023 జూలై 13న జరిగింది. నిర్వహణ వ్యయం రు. 6.42 కోట్లుగా ఒప్పందం జరిగింది. పీరియడ్ అయిపోయిన తర్వాత ఫైనల్ బిల్లును 2023, ఆగస్టు 18న రు. 165.62 కోట్ల బిల్లును సమర్పించగా, ఇంజనీర్లు ఆమోదించారు. అయితే బిల్లు చెల్లించకుండా ప్రభుత్వం పెండింగులో ఉంచేసిందని నోటీసులో సంస్ధ చెప్పింది. చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి ప్రభుత్వానికి 12 లేఖలు రాసినా, నిర్వహణ బిల్లు రు. 6,42 కోట్లను అడిగినా ప్రభుత్వం చెల్లించలేదని సంస్ధ ఆరోపించింది.

ప్రభుత్వం ఏమంటోంది ?

అయితే రేవంత్ ప్రభుత్వం వాదన మరోవిధంగా ఉంది. ఎలాగుందంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన బ్యారేజీల నిర్మాణాలు బీఆర్ఎస్ హయాంలోనే అంటే 2023, అక్టోబర్ లోనే దెబ్బతినేసినట్లు ఆరోపించింది. బ్యారేజీల నిర్వహణను నిర్మాణ సంస్ధలు సక్రమంగా పట్టించుకోకపోయినా ప్రభుత్వం మాత్రం పనిపూర్తయిపోయినట్లు సర్టిఫికేట్ ఇచ్చేసిందని ఆరోపిస్తోంది. డిఫెక్ట్ లయబులిటి పీరియడ్ పూర్తి కాకుండానే బ్యారేజీలు దెబ్బతిన్న విషయాన్ని ఎత్తిచూపుతోంది. నిబంధనల ప్రకారం దెబ్బతిన్న బ్యారేజీల మరమ్మతులను సొంత నిధులతో నిర్మాణ సంస్ధలే చేయాలని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. అంటే ఇటు ప్రభుత్వం అటు కాంట్రాక్ట్ సంస్ధ పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి తాము లీగల్ నోటీసు పంపినట్లు కాంట్రాక్ట్ సంస్ధ చెబుతుంటే తమకు ఎలాంటి లీగల్ నోటీసు అందలేదని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఎవరు చెప్పేది నిజం, చివరకు ఏమి జరుగుతుందన్నది చూడాల్సిందే.

Read More
Next Story