విజయ్‌కు అన్నీ అడ్డంకులేనా ?
x
TVK chief Vijay

విజయ్‌కు అన్నీ అడ్డంకులేనా ?

విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనీయకూడదు అన్నధోరణే గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ ఆర్లేకర్‌లో కనబడుతోందనే అనుమానాలు జనాల్లో పెరిగిపోతున్నాయి


తమిళనాడు రాజకీయాల్లో విచిత్రమైన పరిస్ధితి కనబడుతోంది. విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనీయకూడదు అన్నధోరణే గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ ఆర్లేకర్‌లో కనబడుతోందనే అనుమానాలు జనాల్లో పెరిగిపోతున్నాయి. ఈమధ్యనే వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే కూటములు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దరిదాపుల్లో కూడా లేవు. 234 సీట్ల అసెంబ్లీలో విజయ్ పార్టీకి 107 సీట్లు వచ్చాయి. 108 చోట్ల గెలిచింది కాని రెండు నియోజకవర్గాల్లో గెలిచిన విజయ్ ఒకచోట రాజీనామా చేశారు. దాంతో పార్టీ బలం 108 నుండి 107కి తగ్గిపోయింది.

టీవీకే తర్వాత డీఎంకేకి 59 సీట్లు, అన్నాడీఎంకేకి 47 సీట్లు వచ్చాయి. డీఎంకే, అన్నాడీఎంకే కూటములుగా పోటీచేసినా మిగిలిన భాగస్వామ్య పార్టీలకు చెప్పుకోదగ్గ సీట్లు రాలేదు. కాంగ్రెస్ కు 5 సీట్లు, పీఎంకేకి 4, ఐయూఎంఎల్ కు 2, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2, బీజేపీ 1, డీఎండీకే 1, ఎంఎన్ కేజెడ్ 1 సీటు చొప్పున గెలుచుకున్నాయి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విజయ్ కు కాకుండా మరే ఇతర పార్టీలకు లేదా కూటములకు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సీన్ లేదని. విజయ్ పార్టీ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి అవసరమైన బలానికి దగ్గరలో ఉంది.

ఏపార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేయటానికి సరిపడా బలం లేని నేపధ్యంలో ఐదుగురు ఎంఎల్ఏలున్న కాంగ్రెస్ పార్టీ విజయ్ కు మద్దతు పలికింది. దాంతో విజయ్ బలం 112కి పెరిగింది. పీఎంకే, వీసీకే, వామపక్షాలతో విజయ్ పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. వీళ్ళందరు కూడా కలిసొస్తే బొటాబిటి మెజారిటితోనే అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత సంఖ్యాబలం విజయ్ కు వస్తుంది. అయితే ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందన్నది వేరేసంగతి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటినుండి విజయ్‌ను ఏదో పద్దతిలో అడ్డుకుంటునే ఉన్నారు. పార్టీ పెట్టకుండా ఏవేవో అడ్డంకులు సృష్టించారు. అన్నీ అడ్డంకులను దాటుకుని విజయ్ పార్టీ పెట్టాడు. పార్టీ ఆవిర్భావం రోజున కరూర్ లో జరిగిన తొక్కిసలాటను మిగిలిన పార్టీలు వివాదాస్పదం చేసేశాయి. బహిరంగసభ జరిగి విజయ్ వెళ్ళిపోయిన తర్వాత జరిగిన తొక్కిసలాటకు కూడా విజయ్‌నే బాధ్యుడిని చేసి కేసులు నమోదుచేశారు. ఎన్ని కేసులు నమోదైనా భయపడకుండా విజయ్ ముందుకెళ్ళాడు. ఎన్నికల తేదీ ప్రకటన తర్వాత కుటుంబంలో గొడవలు రోడ్డున పడ్డాయి. భార్య సంగీత విడాకులు కోరుతు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖలుచేయటం సంచలనం సృష్టించింది.

విడాకుల కేసును అడ్డుపెట్టుకుని నటి త్రిషా కృష్ణన్ తో సంబంధాలున్నాయని విపరీతమైన ట్రోలింగ్ చేసి జనాలను దూరం చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ ట్రోలింగులను లెక్కచేయకుండా విజయ్ ముందుకు వెళ్ళాడు. చివరకు ఎన్నికల్లో మెజారిటి జనాలు విజయ్ పార్టీకి పట్టంకట్టినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని రాకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటికి రెండుసార్లు గవర్నర్ ను విజయ్ కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. బలనిరూపణకు రెండువారాల గడువు కావాలని కోరారు. అయినా గవర్నర్ మాత్రం విజయ్ కు అవకాశం ఇవ్వటంలేదు.

నిజానికి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత బలం ఏ పార్టీకి రాకపోతే అన్నీ పార్టీల్లోకి అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీని గవర్నర్ ఆహ్వానిస్తారు. కర్నాటక, గోవాలో జరిగింది ఇదే. పోస్ట్ అలయన్స్ లేదా ప్రీ అలయన్స్ లో ఏదో ఒక పద్దతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం పార్టీలకు గవర్నర్ ఇవ్వాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు. ఏ పద్దతిలో చూసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం టీవీకే పార్టీకి తప్ప మరో పార్టీ లేదా కూటములకు లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత బల నిరూపణ చేసుకోలేకపోతే విజయే రాజీనామా చేస్తారు అనటంలో సందేహంలేదు. ఈ విషయం తెలిసినా విజయ్‌ను ముందు బలనిరూపణ చేసుకోమని గవర్నర్ కోరుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

బలనిరూపణ చేసుకున్న తర్వాతే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఇస్తానని విజయ్‌తో గవర్నర్ స్పష్టంగా చెప్పేశారు. ఇపుడున్న నెంబర్ గేమ్ ఇలానే కంటిన్యు అయితే తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత సీన్ ఏ పార్టీ లేదా కూటమికి రాదు. ప్రభుత్వ ఏర్పాటుకు, బలనిరూపణకు విజయ్‌కు అవకాశం ఇవ్వకుండానే చివరకు రాష్ట్రపతి పాలన విధించేస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే జరిగితే విజయ్ నెత్తిన పాలు పోసినట్లే అవుతుంది. ఎందుకంటే తొందరలోనే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయని అనుకుందాం. అప్పుడు జరిగే ఎన్నికల్లో జనాలు విజయ్‌కు బంపర్ మెజారిటి ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు లేదా కూటములకు ఇపుడున్న సీట్లు వచ్చేది కూడా అనుమానమే. చివరకు ఏమి జరుగుతుందో చూద్దాం.

Read More
Next Story