
భూసేకరణలో పెరిగిపోతున్న ‘సెక్షన్ 10 ఏ’ దుర్వినియోగం
మూసీ భూసేకరణ విషయంలో ప్రభుత్వం సెక్షన్ 10 ఏ ని దుర్వినియోగం చేస్తుందన్న విమర్శలు పెరిగిపోతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. ఏ ప్రాంతంలోనైనా భూమిని సేకరించే ముందు ఎస్ఐఏ (social impact assessment)జరపడం తప్పనిసరి. దీనివల్ల ఎంతమంది ప్రజలు ఉపాధి కోల్పోతారు? ఎంతమంది నిర్వాసితులవుతారు? ప్రాజెక్టుకు నిజంగానే అంత భూమి అవసరమా? అని నిపుణులతో అధ్యయనం చేయిస్తారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి 70-80 శాతం మంది బాధితుల అంగీకారం పొందాకే ముందుకెళ్లాలి.
కేసీఆర్ ప్రభుత్వం భూసేకరణను వేగవంతం చేసేందుకు ఈ చట్టానికి రాష్ట్ర స్థాయిలో మార్పులు చేస్తూ 'సెక్షన్ 10ఏ ' ని చేర్చింది.దీని ప్రకారం.. మౌలిక వసతులు, పరిశ్రమలకి సంబంధించిన ప్రభుత్వ ప్రాజెక్టులకు ఎస్ఐ ఏ నిర్వహించకుండా, రైతులఅంగీకారం వసరం లేకుండా మినహాయింపు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తుంది.ఇప్పుడు ఇదే సెక్షన్ 10 ఏ వెసులుబాటుతో ప్రభుత్వం చేస్తున్న భుసేకరణల పట్ల బాధితులు,పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు వల్లే సెక్షన్ 10 ఏ మళ్ళి చర్చల్లోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలోని దర్గా ఖలీజ్ ఖాన్ గ్రామంలో సుమారు తొమ్మిది ఎకరాల భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ భూయజమానులు హైకోర్టును ఆశ్రయించారు.2013 భూసేకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం తమ భూములకు మినహాయింపు ఉన్నప్పటికీ అధికారులు తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్తున్నారని బాధితులు కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు.దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు బాధితుల భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.అయితే సెక్షన్ 10 ఏ కింద ఆ భూములు తీసుకోవచ్చని ప్రభుత్వం వాదన. ప్రభుత్వం ‘సెక్షన్ 10 ఏ ‘పేరుతో ఈ భూసేకరణ చేస్తున్నానని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ‘సెక్షన్ 10 ఏ’ ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

