
పేపర్ లీక్‌లపై మోదీ వార్నింగ్.. దోషులకు కఠిన శిక్షలు
నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల నిరసనల మధ్య పరీక్షా వ్యవస్థపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు, నిరసనలపై తాజా వివరాలు.
నీట్ పేపర్ లీక్ వివాదంపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం స్పందించారు. విద్యార్థులను మోసం చేయొద్దని, స్వప్రయోజనాల కోసం యువతను వినియోగించుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర రెండో రోజు కూడా ఉదయం నుండి కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర నిరసన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, యువత అంతా పార్లమెంట్‌ను ముట్టించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రధాని ఈరోజు స్పందించారు. పేపర్ లీక్‌లను అడ్డుకోవడం దేశం బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. దోషులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జరిగిన ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని ఈ అంశంపై మాట్లాడారు. దేశ యువతకు నమ్మకమైన, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. తర్వాత కేంద్రమంత్రి కిరణ్న్ రిజిజు మీడియాతో మాట్లాడుతు పేపర్ లీక్‌లకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని స్పష్టం చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు. మొన్నటి మే నెలలో జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీకవ్వటం దేశంలో సంచలనంగా మారింది.
నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఉన్నత విద్యాశాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ పలు రాష్ట్రాల్లో నిందితులను అరెస్ట్ చేసింది. ఈ కుట్రలో ఉన్న వారందరినీ గుర్తించే దిశగా విచారణ కొనసాగుతోంది. మరోవైపు సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని ఆ సంస్థ డిమాండ్ చేస్తోంది.
సోమవారం నిర్వహించిన "చలో పార్లమెంట్" నిరసన ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ ను చుట్టుముట్టిన నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టియర్ గ్యాస్, లాఠీచార్జ్ సుమారు 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆందోళనకారులపై పోలీసులు బలప్రయోగం చేశారని నిరసనకారులు ఆరోపించారు. ఈ ఘటనల తర్వాత ప్రధాని మోదీ జరిగిన ఘటనపై స్పందించారు. యువతను అశాంతి దారిలోకి నెట్టవద్దని, వారిని సరైన మార్గంలో నడిపించడం సమాజంలోని అందరి బాధ్యతగా గుర్తుచేశారు.

