
‘ప్రాణహాని ఉంది : సెక్యూరిటీ కావాలి’
తన ప్రాణాలకు హాని ఉంది కాబట్టి వెంటనే తనకు భద్రత కల్పించాలని బాధితురాలు కోర్టుకు విజ్ఞప్తిచేశారు.
తన ప్రాణాలకు హాని ఉందని బాధితురాలు మీడియాతో చెప్పారు. తన ప్రాణాలకు హాని ఉంది కాబట్టి వెంటనే తనకు భద్రత కల్పించాలని బాధితురాలు కోర్టుకు విజ్ఞప్తిచేశారు. కేసు విచారణలో భాగంగా శుక్రవారం నాంపల్లి కోర్టుకు బాధితురాలు వచ్చారు. అయితే ఉదయం నుండి తనను గుర్తుతెలీని కొందరు వెంటాడుతున్నారని, కోర్టులో కూడా తనను వెంబడించారని యువతి మీడియాతో చెప్పారు. మీడియాకు దూరంగా వెళిపోతున్న ఒక యువకుడిని బాధితురాలు చూపించారు. సదరు యువకుడు నల్ల ప్యాంట్, తెల్ల చొక్కా ధరించున్నాడు.
ఇంతకీ విషయం ఏమిటంటే మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయం గడచిన మూడురోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తనమీద క్రిమినల్ కేసు నమోదైన విషయాన్ని మీనాక్షి నామినేషన్లో చెప్పకుండా దాచిపెట్టారని బీజేపీ మంత్రి ఫిర్యాదు చేశారు. మంత్రి ఫిర్యాదు ఆధారంగా రిటర్నింగ్ అధికారి మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించారు. దాంతో రాష్ట్రంలోని మూడు రాజ్యసభ సీట్లను బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకున్నది.
మీనాక్షి పైన క్రిమినల్ కేసు ఉందన్న విషయం వినగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ క్రిమినల్ కేసు కూడా తెలంగాణలోనే నమోదయ్యింది అనేటప్పటికి అందరికీ షాక్ కొట్టినట్లయ్యింది. కారణం ఏమిటంటే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినపుడు తెలంగాణ కాంగ్రెస్ ఇంచర్జి మీనాక్షిపైన క్రిమినల్ కేసు ఎలా నమోదవుతుందన్నది అందరినీ ఆశ్చర్యంలోపడేసింది. అయితే ఎప్పుడో 2022లో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభ శివకుమార్ రెడ్డికి ఒక యువతికి మధ్య వివాదం మొదలైంది. అది అనేక దశలను దాటి చివరకు తెలంగాణ ఇంచార్జి కాబట్టి మీనాక్షి దగ్గరకు చేరుకున్నది.
తనను కలసిన బాధితురాలితో మీనాక్షి మాట్లాడుతు వివాదాన్ని పరిశీలిస్తానని చెప్పి పంపేశారు. అయితే వివాదం వివాదంలా మిగిలిపోవటమే కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న రెడ్డి కుటుంబంలో ముగ్గురికి పదవులు వచ్చినట్లు బాధితురాలు చెబుతున్నారు. దాంతో తనకు పార్టీలో అన్యాయం జరిగింది అనే భావనతో మొత్తం ఆరుగురిపైన బాధితురాలు 2025లో నాంపల్లి కోర్టులో ప్రైవేటు పిటీషన్ దాఖలు చేశారు. ఆ ఆరుగురిలో మీనాక్షిని కూడా బాధితురాలు చేర్చారు. నిజానికి కాంగ్రెస్ నేతకు, సదరు యువతికి వివాదం మొదలైనపుడు పార్టీ ఇంచార్జిగా ఉన్నది దీపా దాష్ మున్షీ. అప్పట్లోనే మున్షీని కూడా బాధితురాలు కలిశారు. అప్పటినుండి తన గోడును ఎవరూ పట్టించుకోవటంలేదన్న కోపంతో 2025లో కోర్టులో పిటీషన్ దాఖలుచేశారు.
పిటీషన్ దాఖలు చేసేటప్పటికి ఇంచార్జిగా ఉన్నది మీనాక్షి కాబట్టి ఈమె పేరును కూడా బాధితురాలు ఫిర్యాదులో చేర్చారు. ఈ వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు తీవ్రంగా స్పందించారు. మీనాక్షిపై తెలంగాణలో ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదన్నారు. ఈ ఫిర్యాదులో పేరుంది కాబట్టి మీనాక్షి నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించటం పెద్ద సంచలనంగా మారింది.
ఇపుడు అసలు విషయానికి వస్తే ఈరోజు కోర్టులో బాధితురాలు మీడియాతో మాట్లాడుతు ‘‘తనకు థ్రెట్ ఉంది’’ అన్నారు. ‘‘ఉదయం నుండి తనను గుర్తుతెలీని కొందరు ఫాలో అవుతున్నారు’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘తనకు థ్రెట్ ఉందన్న విషయాన్ని మూడునెలల క్రితమే డీజీపీని కలిసి చెప్పాను’’ అన్నారు. ‘‘తన ఫిర్యాదును తాను ఏ రాజకీయ పార్టీకి ఇవ్వలేదు’’ అని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ‘‘రాజకీయాలతో తనకు సంబంధంలేదు’’ అని కూడా అన్నారు. తనకు న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నట్లు బాధితురాలు వివరించారు.
మీనాక్షి వివాదం వెలుగుచూసిన దగ్గర నుండి బాధితురాలిని సంప్రదించేందుకు మీడియా తెగ ప్రయత్నించింది. ఎందుకనో ఆమె ఎవరితోను మాట్లాడలేదు. అయితే ఈరోజు నాంపల్లి కోర్టుకు విచారణ నిమిత్తం బాధితురాలు వస్తున్నారని తెలుసుకున్న మీడియా ఆమె కోసం కాపుకాసింది. కేసు విచారణ వాయిదాపడగానే బాధితురాలు కోర్టు హాలు నుండి బయటకు వచ్చారు. వెంటనే మీడియా ఆమెను చుట్టుముట్టేసింది. దాంతో మీడియాపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మాస్క్ పెట్టుకునే కొద్దిసేపు మీడియాతో మాట్లాడిన తర్వాత బాధితురాలు వెంటనే అక్కడినుండి వెళ్ళిపోయారు.

