ఆంధ్రా-తెలంగాణాల మధ్య ముదురుతున్న నాగార్జునసాగర్ వివాదం
x

ఆంధ్రా-తెలంగాణాల మధ్య ముదురుతున్న 'నాగార్జునసాగర్' వివాదం


తెలంగాణా-ఆంధ్రప్రదేశ్ ల మధ్య మళ్ళీ నాగార్జునసాగర్ విషయంలో జలవివాదం తలెత్తింది. నీటి కేటాయింపు విషయంలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు అనుమతి ఇవ్వకుండానే సాగర్ కుడికాలువ నుండి మొదట 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకుని తర్వాత దాన్ని 2,000 క్యూసెక్కులకి పెంచుకుని ఏపీ విడుదల చేసుకోవటం ఇప్పుడు వివాదానికి కారణమైంది. దీనికి ప్రతిచర్యగా తెలంగాణా కూడా ఎడమకాలువ నుండి 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకున్నది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనుమతి లేకుండా రెండు రాష్ట్రాలూ తమిష్టం వచ్చినట్టు తాము నీటిని విడుదల చేసుకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయని ఇరిగేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయం నుండి నీటి వాడకంలో నీటి నిష్పత్తిని 34 శాతం నుండి 50శాతానికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూనే ఉంది.


నాగార్జునసాగర్ జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం 312 టిఎంసిలు. అయితే అందులో 107 టిఎంసిల 'డెడ్ స్టోరేజ్' నీటిని మినహాయిస్తే, రెండు రాష్ట్రాలు వాడుకోవడానికి అనువుగా ఉండే నీరు 205 టిఎంసి లు మాత్రమే. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు అమలు చేస్తున్న 66:34 తాత్కాలిక కేటాయింపు నిష్పత్తి ప్రకారం, ఒకసంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు కుడి కాలువ ద్వారా సగటున 130 నుండి 135 టిఎంసి ల నీరు లభిస్తుంది. అదే సమయంలో తెలంగాణకు ఎడమ కాలువ, మిషన్ భగీరథ తాగునీటి పథకాల ద్వారా సగటున 65 నుండి 70 టిఎంసి ల నీరు అందుతుంది.


ప్రస్తుత వివాదం గురించి ఫార్మర్ కమిషన్ లో మైనర్ ఇరిగేషన్ కమిటి మెంబర్ లుబ్నా సార్వత్ మాట్లాడుతూ ఆంధ్రా ప్రభుత్వం ఈ విషయంలో రెండు తప్పులు చేసిందని చెప్పారు. మొదటిది కేఆర్ఎంబి అనుమతి లేకుండానే ఏకపక్షంగా నీటిని విడుదల చేయడం తప్పన్నారు. రెండో తప్పు నీటి పరిణామాన్ని 500 క్యూసెక్కుల నుండి 2 వేల క్యూసెక్కులకు పెంచుకోవటం అన్నారు.

Read More
Next Story