తెలంగాణలో కొత్తగా ఏర్పడే ఎంపీ సీట్లివేనా ?
x

తెలంగాణలో కొత్తగా ఏర్పడే ఎంపీ సీట్లివేనా ?

అత్యధిక ఓట్లున్న నియోజకవర్గాలను తీసుకుని వాటిలోని ఓట్లను కొత్తగా ఏర్పడబోయే 9 సీట్లకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి


నియోజవకర్గాల పునర్విభజనలో భాగంగా తెలంగాణలో కొత్తగా తొమ్మిది లోక్‌సభ సీట్లు ఏర్పాటవుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు రాష్ట్రంలో లోక్‌సభ సీట్లు 17 నుండి 26కి పెరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ నేతల సమాచారం ప్రకారం ఇపుడున్న పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకదాని పేరుమారటమే కాకుండా కొత్తగా 9 నియోజకవర్గాలు కొత్తగా రాబోతున్నాయి. ఇపుడు అత్యధికంగా మేడ్చల్- మల్కాజ్ గిరి లోక్ సభ సీటులో సుమారు 38 లక్షల ఓట్లున్నాయి. దేశంమొత్తంమీద అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో మల్కాజ్ గిరి సీటు మొదటిస్ధానంలో ఉంది. కొత్తగా 9 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు 60అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవబోతున్నాయి. మల్కాజ్‌గిరి సీటులోని 38లక్షల ఓట్లను తగ్గించి కొత్తగా ఏర్పాటవబోయే నియోజకవర్గాలకు సర్దుబాటు చేయబోతున్నట్లు సమాచారం.

అత్యధిక ఓట్లున్న 9 నియోజకవర్గాలను తీసుకుని వాటిలోని ఓట్లను కొత్తగా ఏర్పడబోయే 9 సీట్లకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సర్దుబాటు వల్ల ఏమవుతుందంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను సగటున 10-15 లక్షల ఓట్లు ఉండే అవకాశముంది. సరే, ఇపుడు విషయం ఏమిటంటే పెరగబోయే అంచనా 9 నియోజకవర్గాలు ఏవంటే మంచిర్యాల, కొత్తగూడెం/భద్రాచలం, హనుమకొండ, కామారెడ్డి, కూకట్ పల్లి/శేరిలింగంపల్లి, రంగారెడ్డి/పరిగి, వికారాబాద్, సూర్యాపేట, నారాయణపేట/కొడంగల్ గా ప్రచారంలో ఉంది. వీటిలో గతంలో భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గం ఉండేది. అయితే 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భద్రాచలం నియోజకవర్గం స్ధానంలో మహబూబాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. మళ్ళీ ఇపుడు పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడే అవకాశముందని సమాచారం.

ఇదే సమయంలో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి బదులు సంగారెడ్డి అనే కొత్తపేరు వచ్చే అవకాశముంది. నియోజకవర్గం స్వరూపం మారదు. కేవలం జహీరాబాద్ పేరుకు బదులు సంగారెడ్డి అనే పేరు వచ్చే అవకాశముంది. పార్లమెంటులో పునర్విభజన బిల్లు పాస్ అయిన తర్వాత కేంద్రప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ తో మాట్లాడి డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటుచేస్తుంది. ఈ కమిషన్ కు ఛైర్మన్ గా సుప్రింకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి ఉంటారు. సభ్యులుగా కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ కమిషనర్ లేదా ఆయన ప్రతినిధితో పాటు అన్నీరాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఐదుగురు ఎంపీలు, ఐదుగురు ఎంఎల్ఏలు ఉంటారు. ఈ కమిషన్ అన్నీ రాజకీయపార్టీలతోను, ప్రజా సంఘాలు, ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించిన తర్వాత కాని రిపోర్టు రెడీచేసిన తర్వాత కాని కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు ఏవి, నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ ఏది అన్న విషయం తెలీదు.

పార్లమెంటు నియోజకవర్గాలు ఎన్ని పెరిగినా ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 6 లేదా 7 నియోజకవర్గాలన్నీ అదే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకే వచ్చేట్లుగా కసరత్తు జరుగుతోంది. ఇపుడు ఒక పార్లమెంటు నియోజకవర్గంలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ ఒకే పార్లమెంటు పరిధిలో లేవు. కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిల్లోకి వచ్చేఅసెంబ్లీలు రెండు లేదా 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో విస్తరించున్నాయి. దీనివల్ల ఎదరవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకునే అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకే పార్లమెంటు పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Read More
Next Story