
కేసీఆర్ కు క్లీన్ చిట్ ఏమీరాలేదు..హరీష్ ఓవర్ యాక్షన్ ?
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగలేదని కాని, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కక్షపూరితమని కూడా ఎక్కడా చెప్పలేదు
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కేసీఆర్‌కు హైకోర్టు క్లీన్ చిట్ ఏమీ ఇవ్వలేదు. విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తీరును మాత్రమే తప్పుపట్టింది. అంతేకాని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగలేదని కాని, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కక్షపూరితమని కూడా ఎక్కడా చెప్పలేదు. పైగా పీసీ ఘోష్ కమిషన్ నియామకం చట్టబద్దమనే స్పష్టంచేసింది. కాకపోతే కమిషన్ విచారణ తీరు సరిగాలేదు కాబట్టే కేసీఆర్, హరీష్ రావు తదితరులపై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని మాత్రమే ఆదేశించింది. అంటే కాళేశ్వరం ఆరోపణల నుండి కేసీఆర్‌కు ఎలాంటి న్యాయపరమైన రక్షణ దొరకలేదని అర్ధమవుతోంది. ఇంతోటిదానికి హరీష్ రెచ్చిపోతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హైకోర్టు అవినీతి జరగలేదని తీర్పిచ్చినట్లుగా రెచ్చిపోతున్నాడు. ‘‘సత్యమేవ జయతే’’ అని ట్విట్టర్లో పోస్టు పెట్టిన హరీష్ ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కక్షసాధింపులు ఆపాలి’’ అని డిమాండ్ చేయటమే విడ్డూరంగా ఉంది.
హైకోర్టు ఏమి చెప్పిందంటే అవి సాక్షిగా కేసీఆర్, హరీష్ తదితరులను పిలిచిన కమిషన్ నిందితులుగా పేర్కొనటాన్ని ఆక్షేపించింది. సాక్షిగా పిలిచి బాధ్యులుగా కమిషన్ ఎలా చేస్తుందని హైకోర్టు నిలదీసింది. సాక్ష్యులుగా పిలిచి విచారించిన వారినే నిందితులుగా తేల్చాలంటే క్రాస్ ఎగ్జామినేషన్ కు మరోసారి అవకాశం ఇవ్వాలని స్పష్టంచేసింది. కేసీఆర్, హరీష్ తదితరులను సాక్ష్యులుగా విచారించిన కమిషన్ సెక్షన్ 8బీ నిబందన పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. అంటే ఎవరికైనా వ్యతిరేకంగా తీర్పిచ్చేముందు సదరు వ్యక్తులకు నోటీసులు జారీచేసి వాదన వినిపించే అవకాశాలు కల్పించలేదని కోర్టు కమిషన్ ను తప్పుపట్టింది. పిటీషనర్ల గౌరవానికి, ప్రతిష్టకు ఎలాంటి భంగం కలిగించకూడదని కూడా చెప్పింది. అంటే, కేసీఆర్ తదితరులు అవినీతికి పాల్పడ్డారని చెప్పటం, ప్రభుత్వానికి జరిగిన నష్టానికి వారే బాధ్యులని చెప్పటం తప్పన్నది.
వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్, హరీష్, స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు అవినీతికి పాల్పడలేదు అని హైకోర్టు ఎక్కడా చెప్పలేదు. కాకపోతే వారిని సాక్ష్యాలుగా పిలిచి విచారించిన కమిషన్ నిందితులుగా తేల్చటమే తప్పని చెప్పింది. నిందితులుగా తేల్చేటపుడు వారిని మరోసారి విచారణకు పిలిపించి క్రాస్ ఎగ్జామినేషన్ చేసుండాల్సింది అని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పు మీద ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాగూ సుప్రింకోర్టులో రివ్యూ పిటీషన్ వేస్తుంది. కాబట్టి అప్పుడు సుప్రింకోర్టు ఏమిచెబుతుందో చూడాలి. అంతాచూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కథ ఇప్పట్లో తేలేట్లు లేదని మాత్రం అర్ధమైపోతోంది.
హరీష్ ఓవర్ యాక్షనే నవ్వు తెప్పిస్తోంది. హరీష్ ఏమన్నారంటే ‘‘ఎవరెన్ని కుట్రలు చేసిన ధర్మం జయించింది’’ అన్నారు. కాంగ్రెస్ కుట్రలు బయటపడ్డాయట. ముఖ్యమంత్రి రేవంత్ ప్రజా సమస్యలను పక్కనపెట్టి డ్రామాలు ఆడారు అని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతో రేవంత్ నిజస్వరూపం బయటపడింది అన్నారు.
కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు
— BRS Party (@BRSparty) April 22, 2026
రేవంత్ కుట్రలకు చెంపపెట్టు!
ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు బంద్ పెట్టి
కుంగిన రెండు పిల్లర్లను రిపేర్ చేసి
రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish #KaleshwaramProject pic.twitter.com/aUauwQjNno
పిల్లర్ల మరమ్మతులు చేసి రైతుల ప్రయోజనాలను కాపాడాలి అని హరీష్ డిమాండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. హరీష్ లెక్కప్రకారం పిల్లర్లకు వచ్చిన పగుళ్ళు పగుళ్ళు కాదు. పిల్లర్ల పగుళ్ళు కారణంగా మేడిగడ్డ బ్యారేజ్ ప్లాట్ ఫామ్ కు వచ్చిన చీలికలు చీలికలు కావు. నీటినిల్వకు మేడిగడ్డ పనికిరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి ఇచ్చిన రిపోర్టు తప్పుడుది అన్నట్లుగా ఉంది.

