
‘తనకోసం ఎవరూ రాజీనామా చేయద్దు’ : మీనాక్షి
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఓట్లను కొనుగోలు చేయాలని బీజేపీ అనుకున్నట్లు మీనాక్షి ఆరోపించారు
తాను తెలంగాణ నుండి రాజ్యసభ ఎంపీగా వెళ్ళాలని అనుకోవటంలేదని మీనాక్షి నటరాజన్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసు గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మీనాక్షి ఇంచార్జిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈమధ్యనే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సొంతరాష్ట్రం మధ్యప్రదేశ్ నుండి మీనాక్షి నామినేషన్ వేశారు. అయితే నామినేషన్లో క్రిమినల్ కేసు ఉన్న విషయాన్ని మీనాక్షి దాచిపెట్టారని మధ్యప్రదేశ్ మంత్రి ఫిర్యాదు చేశారు. మంత్రి ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న ఎన్నికల కమిషన్ మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించారు. ఎన్నికల కమిషన్ చర్య కారణంగా మీనాక్షికి రాజ్యసభ ఎంపీ అవకాశం చేజారిపోయింది.
సొంతరాష్ట్రంలో చేజారిన ఎంపీ అవకాశాన్ని మీనాక్షికి తెలంగాణ నుండి కల్పించే విషయాన్ని పార్టీ అధిష్ఠానం పరిశీలించింది. తెలంగాణ నుండి మీనాక్షిని రాజ్యసభకు పంపటానికి వీలుగా తెలంగాణ ఎంపీల్లో ఒకరు రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పార్టీ అధిష్ఠానం దగ్గర ప్రతిపాదించారని, కాంగ్రెస్ అగ్రనేతలు పరిశీలిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ నుండి పార్టీ తరపున రాజ్యసభ ఎంపీలుగా రేణుకాచౌదరి, అనీల్ కుమార్ యాదవ్, అభిషేక్ మనుసింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. రేణుక, యాదవ్ ఎంపీలై సుమార ఏడాదన్నిర అవుతోంది. సింఘ్వి, వేం మొన్నటి మార్చి/ఏప్రిల్ లోనే ఎంపీలుగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ నలుగురిలో రేవంత్ కు వేం అత్యంత సన్నిహితుడు. అందుకనే వేంను ప్రభుత్వ సలహాదారుడినిగా రేవంత్ నియమించుకున్నారు. కాబట్టి మీనాక్షి కోసం వేంతో రాజీనామా చేయించటానికి రేవంత్ రెడీగా ఉన్నట్లు బాగా ప్రచారం అవుతోంది.
ఈ విషయమై మీనాక్షి మాట్లాడుతు ‘‘తాను తెలంగాణ నుండి రాజ్యసభకు వెళ్ళాలని అనుకోవటంలేదు’’ అని చెప్పారు. ‘‘తనకోసం తెలంగాణలో ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు’’ అని స్పష్టంగా చెప్పారు. ‘‘తన సొంతరాష్ట్రం మధ్యప్రదేశ్ నుండే తాను ఎంపీగా వెళతాను’’ అని నమ్మకంగా చెప్పారు. మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు వెళ్ళటానికి అవకాశం ఎక్కడుందో మీనాక్షికే తెలియాలి. భవిష్యత్తులో రాబోయే ఖాళీలను దృష్టిలో పెట్టుకుని మీనాక్షి చెప్పుంటారు అని అనుకోవాలి.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఓట్లను కొనుగోలు చేయాలని బీజేపీ అనుకున్నట్లు మీనాక్షి ఆరోపించారు. ‘‘ఓట్ల కొనుగోలుకు అవకాశం లేదని అర్ధమవటంతోనే తన నామినేషన్‌ను తిరస్కరించేట్లుగా కుట్రచేశారు’’ అని విరుచుకుపడ్డారు. ‘‘తన నామినేషన్ తిరస్కరించే విషయంలో బీజేపీతో ఎన్నికల కమిషన్ చేతులు కలిపింది’’ అని ఆరోపించారు. లీగల్ నోటీసు ఎప్పటికి క్రిమినల్ కేసు కాదని చెప్పారు. ‘‘నామినేషన్ పత్రంలో లీగల్ నోటీస్ అన్న కాలమే లేదు’’ అన్న విషయాన్ని మీనాక్షి గుర్తుచేశారు. ‘‘సీటు చోరి అన్నది తన విషయానికి మాత్రమే పరిమితం కాదని దేశం మొత్తానికి సంబందించిన బీజేపీ కుట్ర’’ అని మీనాక్షి నటరాజన్ వర్ణించారు.

