
మహిళా రిజర్వేషన్లపై రాజకీయం అక్కర్లేదు: రేవంత్
సవరించిన మహిళ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే మద్దతు తెలపడానిక అభ్యంతరం లేదన్న తెలంగాణ సీఎం.
మహిళా రిజర్వేషన్‌కు మద్దతు పలకడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ ముసుగు తీసి చిత్తశుద్ధితో మహిళల మేలు కోసం, సాధికారత కోసం రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని ఆయన కేంద్రానికి సూచించారు. శుక్రవారం పార్లమెంటులో తాము మహిళా రిజర్వేషన్ల బిల్లును ఓడగొట్టలేదని, ఈ బిల్లు ముసుగుతే సీట్లు తగ్గించాలన్న బీజేపీ కుట్రను భగ్నం చేశామని రేవంత్ వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై ఢిల్లీలో రేవంత్ మాట్లాడుతూ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. 2023 నాటి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్టమెంటులో ప్రవేశపెడితే దానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని రేవంత్ వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్లలో కూడా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు రేవంత్. మహిళా రిజర్వేషన్ల అంశంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, అంతా కలిసి వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మహిళా రిజర్వేషన్ లకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకి కాదు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్‌లను వ్యతిరేకించడం లేదు. మహిళా రిజర్వేషన్‌లో ముసుగు లో రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్‌లు రద్దు చేయాలనే కుట్ర ఏదైతే మోదీ చేస్తున్నారో దానిని మాత్రమే వ్యతిరేకిస్తోంది’’ అని రేవంత్ చెప్పారు.
‘‘సోమవారం మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి చట్టాన్ని ప్రవేశపెట్టండి. అంతా మద్దతు ఇస్తాం. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. రెండు రోజుల్లోనే చట్టాన్ని ఆమోదించండి. 2027 లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వన్ థర్డ్ మహిళా రిజర్వేషన్‌లతో నిర్వహించవచ్చు. 2027 తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన శాసన సభలలో మహిళా రిజర్వేషన్ లను అమలు చేయొచ్చు. 2029 లోక్ సభలో మహిళా రిజర్వేషన్ లను అమలు చేయొచ్చు’’ అని రేవంత్ వివరించారు.
‘‘ఈ అంశంలో రాజకీయ బేషజాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రాజకీయ పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు. మహిళా రిజర్వేషన్ అనేది ఒక గొప్ప బాధ్యత, ఒక గొప్ప అవకాశము, ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పంతాలకు పట్టింపులకు పోకుండా తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభలలో ప్రవేశపెట్టాలి. తక్షణమే ఆమోదింప చేసుకొని మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది’’ అని స్పష్టం చేశారు.
‘‘2023 నుంచి 543 లోక్ సభ సీట్లలో ప్రతి రాష్ట్రంలో ఉన్న శాసనసభ సీట్లలో వన్ థర్డ్ మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి అవసరమైన సవరణ ఏవైనా తీసుకురండి. మేము మద్దతు ఇస్తాం అని చెప్తున్నా. వేరే ఏ బిల్లులు ఏ ముసుగులతో తీసుకురాకండి. ముసుగుతో వస్తే మేము గుర్తిస్తాము. సీట్ల పెంపు అనేది అంశమే కాదు సీట్ల పెంపు లో ఆయన ఎన్నుకున్న విధానాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాము’’ అని రేవంత్ వివరించారు.

