
గెలిచినంత ఈజీ కాదు విజయ్‌కు
ఎన్నికల సమయంలో జనాలకు విజయ్ పార్టీ టీవీకే తరపున చాలా హామీలిచ్చాడు
ఎన్నికల్లో గెలుపుకోసం నోటికొచ్చిన హామీలను ఇచ్చేయటం రాజకీయపార్టీల అధినేతలకు చాలా మామూలైపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేక నానా అవస్తలు పడటం అదరం చూస్తునే ఉన్నాము. తెలంగాణ, ఏపీ, కర్నాటకలో అధికారంలోని పార్టీలు ఏమిచేస్తున్నాయో అందరు చూస్తున్నదే. ఇదంతా ఇప్పుడెందుకు అంటే తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్‌కు ముందుంది మొసళ్ళ పండగ అని గుర్తుచేసేందుకే. విషయం ఏమిటంటే ఎన్నికల సమయంలో జనాలకు విజయ్ పార్టీ టీవీకే తరపున చాలా హామీలిచ్చాడు. ఇందులో ఆచరణ సాధ్యంకాని హామీలు కూడా చాలానే ఉన్నాయి. విజయ్ ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలంటే తమిళనాడు ప్రభుత్వం మీద అదనంగా ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని సమాచారం.
విజయ్ ఇచ్చిన హామీల్లో మచ్చుకి మహిళలకు నెలకు రు. 2500 ఆర్ధికసాయం, వధువుకు పెళ్ళి కానుకగా 8 గ్రాముల బంగారం+పట్టుచీర, గ్రాడ్యుయేట్లకు నిరుద్యోగ భృతిగా నెలకు రు. 4 వేలు, వృద్దులు, వికలాంగులకు నెలకు పెన్షన్ రు. 3 వేలు, ఏడాదికి 6 వంటగ్యాస్ సిలిండర్లు ఫ్రీ, గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఉన్నత చదువుల కోసం రు. 20 లక్షల వరకు రుణాలు, 5 లక్షలమందికి పెయిడ్ ఇంటర్న్ షిప్పులు, స్కూలు పిల్లల తల్లులకు ఏడాదికి రు. 15 వేలు, 5 ఎకరాల్లోపు రైతులకు రుణమాఫీ, 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాల కల్పన లాంటి అనేక హామీలున్నాయి.
మహిళలకు ఇప్పటివరకు డీఎంకే ప్రభుత్వం వెయ్యిరూపాయలు ఇచ్చేది. దీన్ని రు. 2500కి పెంచుతానని విజయ్ హామీ ఇచ్చాడు. నెలకు వెయ్యి రూపాయలంటేనే ఏడాదికి రు. 14,411 కోట్లయ్యేది. అలాంటిది ఇపుడు విజయ్ రు. 2500 హామీ అంటే ఏడాదికి రు. 36 వేల కోట్లవుతుందని అంచనా. అంటే ప్రభుత్వంపై అదనంగా పడేభారం ఏడాదికి రు. 21,618 కోట్లు. ఇపుడు డీఎంకే ప్రభుత్వం ఉచితంగా 100 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందించేది. దీనివల్ల ఏడాదికి రు. 7752 కోట్లు భారంపడేది. ఇపుడు విజయ్ దాన్ని రెట్టింపు అంటే 200 యూనిట్లకు పెంచటంతో భారం రు. 12 వేల కోట్లుగా విశ్లేషకులు లెక్కకట్టారు. వృద్ధులకు మొన్నటివరకు అందిన రు. 1200 పెన్షన్ను విజయ్ రు. 3వేలకు పెంచుతానని చెప్పాడు. ప్రభుత్వం మీద పడబోయే భారం రు. 6,549 కోట్లకు చేరుతుంది.
వితంతు పెన్షన్లకు రు. 1900 కోట్లు, దివ్యాంగుల పెన్షన్లకు రు. 500 కోట్ల భారం పెరుగుతుంది. ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీవల్ల రు. 7, 074 కోట్లు, రైతులకు ఏడాదికి రు. 15 వేల హామీవల్ల సుమారు రు. 2 వేల కోట్ల భారం తప్పదు. యువతుల వివాహం సందర్భంగా 8 గ్రాముల బంగారం+పట్టుచీరంటే కొత్తగా రు. 700 కోట్ల భారం తప్పదని లెక్క. ప్లస్2 చదివిన వారికి ప్రతినెలా రు. 2500, నిరుద్యోగ యువతకు రు. 4 వేలు, ఇంటర్న్ షిప్ చేసే వారికి నెలకు రు. 5-8 వేలు భారం పెరుగుతుంది. చేపల వేటకు వెళ్ళలేని కాలంలో మత్య్సకారుల కుటుంబాలకు నెలకు రు. 27 వేలు, వితంతువులు, అంగన్వాడీ కార్తకర్యలకు నెలకు రు. 18 వేల, పారిశుధ్య కార్మికులకు నెలకు రు. 10 వేలు ఇలాంటి హామీల అమలు చేయాలంటే ప్రభుత్వం మీద అదనంగా ఏడాదికి లక్ష కోట్ల రూపాయల భారం తప్పదని మేథావులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రు. 1.22 లక్షల కోట్ల ఆర్ధికలోటుతో అవస్తలు పడుతోంది. ఈ లోటుకు విజయ్ హామీల అమలుభారం తోడయితే లోటు ఇంకెంత పెరిగిపోతుందో అనే ఆందోళన పెరిగిపోతోంది. హామీల అమలుకు విజయ్ ఒక్కసారిగా లక్ష కోట్ల రూపాయలు ఎక్కడినుండి తెస్తారన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరి విజయ్ ఏమిచేస్తారో చూడాల్సిందే.

