
కవితకు ఒక్కటే ప్రశ్న
కేసీఆర్ పాలనపై అనేక ఆరోపణలు చేస్తున్న కవిత అధికారంలో ఉన్నపుడు ఇవే ప్రశ్నలను ఎందుకు లేవనెత్తలేదు ?
పార్టీ ఏర్పాటు సందర్భంగా కల్వకుంట్ల కవిత శనివారం తన తండ్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై చాలా ఆరోపణలు, విమర్శలు చేశారు. కవిత ఇపుడు చేసిన ఆరోపణలు, విమర్శల్లో కొత్తవి ఏమీలేవు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు మేథావులు, తటస్తులు చాలాసార్లు లేవనెత్తిన అంశాలే కాబట్టి ఇందులో కొత్తవేమీలేవు. కాకపోతే తొమ్మిదిన్నరేళ్ళు ఇతరులు లేవనెత్తిన అంశాలనే ఇపుడు కవిత ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది. కవిత చేసిన ఆరోపణల్లో కీలకమైనవి ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా అవినీతి జరిగిందని. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు అవినీతి పందికొక్కులు రెచ్చిపోయాయని. ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేశారని.
తల్లి కోడిలా మనల్ని కాపాడాల్సిన కేసీఆర్ ఎక్కడక పోయిండు ? అని సూటిగా అడిగారు. ప్రజలే తప్పుచేశారని పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. నా పిల్లలు తప్పుచేస్తే నేను వదిలేస్తానా ? అని సెంటిమెంట్ దట్టించారు. అర్ధరాత్రి హైడ్రా ఇళ్ళు కూలగొడుతుంటే పాత కేసీఆర్ ఎక్కడ ? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆత్మ కోల్పోయినందుకే తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భవించినట్లు చెప్పారు. తండ్రిని ఉద్దేశించి కవిత తాజాగా అడిగిన ప్రశ్నలు, లేవనెత్తిన సందేహాలు అన్నీ నిజమైనవే అనటంలో సందేహంలేదు.
అయితే ఇక్కడే కవితకు జనాలు ఒక ప్రశ్నను సంథిస్తున్నారు. అదేమిటంటే ఇపుడు కేసీఆర్ పాలనపై అనేక ఆరోపణలు చేస్తున్న కవిత అధికారంలో ఉన్నపుడు ఇవే ప్రశ్నలను ఎందుకు లేవనెత్తలేదు ? అని. తండ్రి అధికారంలో ఉన్నపుడు కూతురు హాదాలో కవిత ఆకాశమే హద్దుగా అధికారాలను చెలాయించారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. తండ్రి పాలనలో కవిత కూడా భాగస్తురాలే. ఒకసారి నిజామాబాద్ ఎంపీగా గెలిచి మరోసారి ఓడిపోయారు. తర్వాత నిజామాబాద్ జిల్లా స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్సీగా ఆరేళ్ళు అధికారాలను చెలాయించారు. కేసీఆర్ పాలనను దగ్గరుండి చూసిన కవిత అప్పట్లో ఇదే అంశాలను ఎందుకు లేవనెత్తలేదు ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
అయ్యప్ప సొసైటీలో ఇళ్ళు కూల్చలేదా ?
ఇళ్ళను హైడ్రాతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూల్చేస్తున్నాడని ఇపుడు కవిత ధ్వజమెత్తుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కూడా జేసీబీలు, బుల్ డోజర్లు తదితరాలను పెట్టి అయ్యప్ప సొసైటీలో ఎన్నో ఇళ్ళను కేసీఆర్ కూల్పించేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో నగరం ఇదే విషయమై అట్టుడుకిపోయింది. మరపుడు కవిత ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు. కేసీఆర్ ప్రభుత్వం తప్పుచేస్తోందని కవిత ఎందుకు మాట్లాడలేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అప్పట్లో కవిత ఎందుకు మీడియాతో చెప్పలేదు. కాళేశ్వరం అవినీతికి బాధ్యుడు హరీష్ రావే అని ఇపుడు చెబుతున్న కవిత ఆనాడే ఈమాట ఎందుకని చెప్పలేదు.
కాళేశ్వరం అవినీతిగురించి మాట్లాడినందుకే తనను పార్టీలో నుండి గెంటేసారని ఇపుడు కవిత చెబుతున్నది నిజమేనా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్నపుడు అవినీతి జరుగుతుంటే మాట్లాడని కవిత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాట్లాడి ఏమిటి ఉపయోగం ? పార్టీలో నుండి బయటకు తనను గెంటేయటం ఖాయమని అర్ధమైన తర్వాతే సోదరుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ టార్గెట్ గా కవిత ఆరోపణలు మొదలుపెట్టడంతో ఇక లాభంలేదని అప్పుడు పార్టీలో నుండి సస్పెండ్ చేశారు. తెలంగాణ సాధనలో ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులను దూరంగా పెట్టడం తప్పని కవిత తొమ్మిదిన్నరేళ్ళల్లో ఎప్పుడైనా కేసీఆర్ ను నిలదీశారా ? ఉద్యమకారుల తరపున కేసీఆర్ తో ఎప్పుడైనా మాట్లాడారా ? తెలీదు. గద్దర్ ను ఇంటి గేటుదాటి లోపలికి రానీయనపుడు కూడా కవిత నోరిప్పలేదు. ప్రొఫెసర్ కోదండరామ్ ను అవమానించినపుడు కూడా చేసింది తప్పని కేసీఆర్ కు చెప్పలేదు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు తనకు ఎలాంటి సమస్యలు ఎదురుకానంతవరకు కవిత ఎప్పుడూ నోరిప్పలేదు అన్నది వాస్తవం. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేటీఆర్, హరీష్ తో సమస్యలు మొదలై పార్టీలో ఇమడలేని పరిస్ధితులు తలెత్తినపుడే కవిత గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలుసు. కేటీఆర్, హరీష్ తో సమస్యలు తలెత్తకుండా ఉండుంటే, పార్టీలోనే కంటిన్యు అవుతుంటే ఇపుడు చేస్తున్న ఆరోపణలను కవిత చేసుండే వారుకాదు. తనకేవో సమస్యలు ఎదురై రాజకీయంగా అస్తిత్వానికే ప్రమాదం రావటంతో నాయకత్వంతో విభేదించి బీఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చేశారు కాబట్టే కేసీఆర్ పాలనలో అవినీతని, కాళేశ్వరం అవినీతని నానా గోల చేస్తున్నారని జనాలకు బాగానే అర్ధమవుతోంది. అందుకనే కవితను జనాలు పై ప్రశ్నలు వేస్తున్నారు.
కవిత కూడా బాధ్యురాలే : కూరపాటి
‘బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలకు కవిత కూడా బాద్యత వహించాల్సిందే’ అని కాకతీయ యూనివర్సిటి పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపాటి వెంకటనారాయణ అన్నారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అధికార దుర్వినియోగం, అరాచకాల్లో కవిత పాత్ర తక్కువేమీ కాదు’ అని అభిప్రాయపడ్డారు. ‘అధికారంలో ఉన్నపుడు అన్నీ అనుభవించి పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే ఆరోపణలు మొదలుపెడితే జనాలు కవితను ఎలాగ నమ్ముతారు’ ? అని ప్రశ్నించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన అధినేతగా కన్నా కవితను జనాలు కేసీఆర్ కూతురుగానే ఎక్కువగా చూస్తున్నారు’ అని కూరపాటి వివరించారు. ‘అప్పట్లో దోచుకున్నది సరిపోలేదని ఇపుడు మళ్ళీ కవిత కొత్తపార్టీ పెట్టారు’ అని ప్రొఫెసర్ ఎద్దేవా చేశారు.

