x

ఓనర్ల కొంపముంచుతున్న ‘22ఏ’ నిషేధిత జాబితా(వీడియో)

తమ ఆస్తులు అమ్ముకునేందుకు వీలులేకుండా రెవిన్యుచట్టంలోని 22ఏ చట్టం అడుపడుతోందని నెత్తి నోరు బాదుకుంటున్నారు వేలాదిమంది ఓనర్లు


Click the Play button to hear this message in audio format

రెవిన్యు చట్టంలోని 22ఏ నిషేధిత సెక్షన్ ఓనర్ల కొంపలు ముంచేస్తోంది. తమ ఆస్తులు అమ్ముకునేందుకు వీలులేకుండా రెవిన్యుచట్టంలోని 22ఏ చట్టం అడుపడుతోందని నెత్తి నోరు బాదుకుంటున్నారు వేలాదిమంది ఓనర్లు. తెలంగాణలోని సుమారు 90 లక్షల ఎకరాలను రెవిన్యుశాఖ 22ఏ నిషేధిత సెక్షన్ లో చేర్చేసినట్లు సమాచారం. గతంలో అన్నీ అనుమతులతో స్ధలాలు, భూములు కొనుక్కుని ఆస్తులను డెవలప్ చేసుకున్న యజమానులకు రెవిన్యుశాఖ నిర్ణయం పెద్ద షాక్ అనే చెప్పాలి.

హుడా, హెచ్ఎండీఏ, హౌసింగ్ బోర్డు ద్వారా సుమారు 25 ఏళ్ళ క్రితం కొనుగోలు చేసిన స్ధలాలను కూడా రెవిన్యుశాక నిషేధిత భూముల జాబితాలోకి చేర్చేయటమే ఆశ్చర్యంగా ఉంది. భూములు, భవనాలు 22ఏ నిషేధిత భూముల్లోకి వెళ్ళిపోవటంతో వాటిని రిజిస్ట్రేషన్ చేయటానికి రిజిస్ట్రేషన్ అధికారులు అంగీకరించటంలేదు. ఆస్తులబేరాలు పూర్తయి, డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటాలు పూర్తయిపోయి రిజిస్ట్రేషన్ కు వెళ్ళినపుడు తమ ఆస్తులు నిషేధిత జాబితాలో ఉందని తెలుసుకుని వేలాది మంది ఓనర్లు గొల్లుమంటున్నారు. సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్‌గిరి జిల్లాల్లో అత్యధికంగా నిషేధిత జాబితా వివాదాస్పదమైపోతోంది.

బీఆర్ఎస్ హయాంలో 2019లో ఆవిర్భవించిన ధరణి పోర్టల్ తర్వాత ఇలాంటి వివాదాలు మరింతగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వినబడుతున్నాయి. రెవిన్యుశాఖ అధికారులు గుడ్డిగా ప్రభుత్వ ఆదేశాలను అమలుచేయటం వల్లే ప్రైవేటు ఆస్తులు నిషేధిత జాబితాలో చేరిపోతున్నాయి. వక్ఫ్, దేవాదాయ, ఈనాం భూములు, అసైన్డ్ భూములు మాత్రమే ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకోకుండా రిజిస్ట్రేషన్ అధికారులు అడ్డుకోవాల్సుంది. అయితే ఈ జాబితాలో కోర్టు వివాదంలో ఉన్న ఆస్తులు, ప్రైవేటు ఆస్తులను కూడా రెవిన్యుశాఖ గుడ్డిగా చేర్చేయటంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి.

హైదరాబాద్ లోని బంజారాహిల్స్, కుకట్‌పల్లి, నిజాంపేట్, మియాపూర్, బాచుపల్లి, దిల్ సుఖ్ నగర్, కొండాపూర్, అమీర్‌పేట్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో 22ఏలో చాలా ఆస్తులు నిషేధిత జాబితాలో చేరిపోతున్నట్లు సమాచారం. 22ఏ జాబితాలో నుండి తొలగించటంలో రెవిన్యుశాఖ పూర్తిగా నిర్లక్ష్యంవహిస్తోందని ఓనర్లు మండిపోతున్నారు. తాము ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా రెవిన్యుశాఖ అధికారులు పట్టించుకోవటంలేదని మండిపోతున్నారు. వెంటనే సీఎం రేవంత్ లేదా రెవిన్యుమంత్రి జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి.

ఇదే విషయమై చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, రిటైర్డ్ సెక్రటరీ ఏ రవీంద్రబాబు తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘నిషేధిత జాబితా 22ఏ వివాదాస్పదం కావటానికి రెవిన్యుశాఖే కారణం’’ అని చెప్పారు. ‘‘ప్రభుత్వ ఆదేశాలను రెవిన్యుశాఖ అధికారులు గుడ్డిగా ఫాలో అవటంతోనే ప్రైవేటు ఆస్తులు, కోర్టు వివాదంలో ఉన్న ఆస్తులు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయింది’’ అని తెలిపారు. ‘‘నిషేధిత జాబితా వివాదాల దరఖాస్తులపై రెవిన్యుశాఖలోని ఉన్నతస్ధాయి కమిటి ప్రతి 15 రోజులకు సమావేశమవ్వాలి’’ అన్నారు. అయితే ‘‘ఈ కమిటి సమావేశం జరగని కారణంగానే వివాదాలు పెరిగిపోతున్నాయి’’ అని చెప్పారు. ‘‘తనకున్న సమాచారం ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 90 లక్షల ఎకరాలు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయి’’ అని అన్నారు.

‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్ధికమంత్రి, రెవిన్యుశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా మేల్కొని జనాలు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి చొరవ చూపించాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘ప్రభుత్వం గనుక వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే జనాల్లో వ్యతిరేకత పెరిగిపోవటం ఖాయం’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘ధరణి పోర్టల్ పెట్టిన దగ్గర నుండి ఈ సమస్య పెరిగిపోయింది అనటంలో ఎలాంటి సందేహంలేదు’’ అన్నారు.

Read More
Next Story