పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రాజకీయ నివేదిక: కేటీఆర్
x

పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రాజకీయ నివేదిక: కేటీఆర్

కాళేశ్వరం వివాదంపై హైకోర్టు తీర్పు తర్వాత కేటీఆర్ తీవ్ర విమర్శలు. పీసీ ఘోష్ నివేదిక రాజకీయమని వ్యాఖ్యలు.


కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై హైకోర్టు తాజా తీర్పు వెలువడిన నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అసలు నివేదిక కాదని, అది పూర్తిగా రాజకీయ ప్రేరిత నివేదికేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఆరోపణలు, ప్రచారాలు అన్నీ ఈ తీర్పుతో తేలిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాలేశ్వరాన్ని ‘కూలేశ్వరం’గా చిత్రీకరిస్తూ అబద్ధపు ప్రచారం సాగించారని, ఆ ప్రచారానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని అన్నారు. కూలింది ప్రాజెక్టు కాదని, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలేనని స్పష్టం చేశారు. గతంలో తాము చెప్పినట్లుగానే, కాలేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు చేశిందనే విషయానికి ఈ తీర్పు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నాయకులు చేసిన దుష్ప్రచారం ఈ తీర్పుతో పూర్తిగా కూలిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. అబద్ధాలతో నిజాలను దాచలేమని, కాలేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను తగ్గించలేరని ఆయన అన్నారు. రాహుల్ గాంధీని ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన ఘటనను గుర్తు చేస్తూ, ఆ ప్రచారం కూడా ఇప్పుడు తేలిపోయిందని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ తీర్పు తెలంగాణ ప్రజలు, రైతుల విజయమని పేర్కొన్నారు. సంవత్సరాలుగా సాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ రైతులకు కాలేశ్వరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో గుర్తించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయడం మానుకుని, మరమ్మతులపై దృష్టి పెట్టాలని కేటీఆర్ కోరారు. ప్రాజెక్టులో కొన్ని భాగాలకు మరమ్మతులు అవసరమైనప్పటికీ, వాటిని కూడా అడ్డుకున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్, బీజేపీ కలిసి ఈ ప్రాజెక్టుపై కుట్రలు చేశాయని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయ ప్రచారాలు నిలిపివేసి, ప్రాజెక్టును మళ్లీ ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ అంశంపై భవిష్యత్తులో మరింత స్పష్టత వస్తుందని, అన్ని విషయాలు బయటపడతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More
Next Story