
పొలిటికల్ హీట్ పెంచుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు
వచ్చేఏడాది మార్చిలో జరగబోయే రెండు ఎంఎల్సీ ఎన్నికలు పార్టీల్లో ఇప్పటికే వేడిని రాజేస్తున్నాయి. 2027, మార్చిలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ల కోటా రెండుఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ కోటాలో బీఆర్ఎస్ తరపున పీ వాణి ప్రాతినిధ్యం వహిస్తుండగా, నల్గొండ ఎంఎల్సీగా కాంగ్రెస్ నేత తీన్మార్‌మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు స్ధానాలను గెలుచుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే రెడీ అవుతున్నాయి.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్ధానానికి బీఆర్ఎస్ తరపున ఏనుగుల రవీంద్రరెడ్డి, జనసేన తరపున గడల శ్రీనివాస్ అభ్యర్ధులుగా బరిలో ఉన్నారు. బీజేపీ తరపున మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోడలు క్షమితా రెడ్డి పేరు బలంగా వినబడుతోంది. గట్టి అభ్యర్ధి కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ కోటా ఎన్నికలో అన్నీ పార్టీలు అభ్యర్ధుల పరిశీలనలో బిజీగా ఉన్నాయి.
గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటర్లుగా ఉండే పై రెండు స్ధానాల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్ధానంలో 5.31 లక్షల మంది ఓటర్లున్నారు. ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో 4.64 లక్షల ఓటర్లున్నారు. ఇపుడు జరుగుతున్న సర్ ప్రక్రియలో ఎంతమంది ఓటర్లుంటారు అన్నది సస్పెన్సుగా మారింది. గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చేర్పించే ప్రక్రియను రాజకీయ పార్టీలు పోటీపోటీగా చేపట్టటంతో రాజకీయ వేడి రాజుకుంటోంది. నోటిఫికేషన్ల జారీ, ఉద్యోగల భర్తీ తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ నమ్ముకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే తమను గెలిపిస్తాయని బీఆర్ఎస్, బీజేపీలు ఆశతో ఉన్నాయి.

