రేవంత్ పై మహిళాబిల్లు ఎఫెక్ట్  ?
x

రేవంత్ పై మహిళాబిల్లు ఎఫెక్ట్ ?

క్యాబినెట్ సిఫారసుచేసిన ప్రొఫెసర్, అజారుద్దీన్ పేర్లను ఆమోదించాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇజ్జత్ కు పెద్ద పరీక్ష ఎదురవుతోంది. అదేమిటంటే అజారుద్దీన్ కు ఎంఎల్సీ పదవిని ఇప్పించుకోవటం. ఎవరు ఇవ్వాలంటే గవర్నర్ శివప్రతాప్ శుక్ల. ఎందుకంటే, గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, అజారుద్దీన్‌ను నామినేట్ చేస్తు రేవంత్ క్యాబినెట్ చాలాకాలం క్రితమే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సిఫారసుచేసింది. అయితే న్యాయవివాదం పేరుతో జిష్ణుదేవ్‌వర్మ ప్రభుత్వం పంపిన ఇద్దరు పేర్ల ఫైలుపై సంతకం పెట్టలేదు. అయితే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా అత్యవసరంగా అజారుద్దీన్‌ను రేవంత్ మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. ఇటు శాసనమండలిలోను అటు అసెంబ్లీలోను సభ్యుడుకాని వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆరుమాసాల్లోపు ఏదో ఒక సభలో సభ్యడవ్వాలన్న విషయం అందరికీ తెలిసిందే. ఆరుమాసాల్లోపు ఉభయసభల్లో ఏదో ఒకదానిలో సభ్యుడు కాకపోతే సదరు మంత్రి రాజీనామా చేయాల్సిందే.

ఇపుడు అజారుద్దీన్ మెడపైన రాజీనామా కత్తి వేలాడుతోంది. ఎందుకంటే ఈనెల 30వ తేదీకి అజారుద్దీన్ మంత్రై ఆరుమాసాలు పూర్తవుతుంది. ఇప్పటివరకు రెండుసభల్లో ఎందులోను అజార్ సభ్యుడు కాలేకపోయారు. ఇక ఉన్న గడువు పదిరోజులు మాత్రమే. ఈమధ్యనే గవర్నర్ గా జిష్ణుదేవ్ వెళిపోయి శవప్రతాప్ బాధ్యతలు తీసుకున్నారు. అందుకనే ఈ విషయాలన్నీ వివరించేందుకు రేవంత్ ఆదివారం గవర్నర్ కలిశారు. క్యాబినెట్ సిఫారసుచేసిన ప్రొఫెసర్, అజారుద్దీన్ పేర్లను ఆమోదించాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. పేర్లను ఆమోదించకపోత ఎదురవబోయే సమస్యను కూడా గవర్నర్ కు రేవంత్ వివరించినట్లు సమాచారం.

ఇపుడు సమస్య ఏమిటంటే రెండుపేర్లను గవర్నర్ ఆమోదిస్తారా లేదా అన్నదే. గవర్నర్ గనుక రెండుపేర్లను ఆమోదిస్తే అజారుద్దీన్‌కు ఎలాంటి సమస్యలేకుండా మంత్రిపదవిలో కంటిన్యు అవుతారు. లేకపోతే రాజీనామా చేయాల్సిందే తప్ప వేరేదారిలేదు. రాజీనామా చేయటంవల్ల అజార్‌కు వచ్చే పెద్దనష్టం లేదుకాని సమస్యంతా రేవంత్‌కే. ఎలాగంటే మైనారిటీ వర్గాన్ని రేవంత్ మోసం చేశాడనే గోల మొదలవుతుంది. అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని ఎంఎల్సీ పదవి దక్కకుండా రేవంత్ కావాలనే డ్రామా చేశాడనే ఆరోపణలు మొదలవుతాయి.

గవర్నర్ ఫైల్‌ను ఆమోదిస్తారా లేదా అన్నది పక్కనపెట్టేస్తే గవర్నర్ కోటా లేదా ఎంఎల్ఏల కోటాలో ఇపుడున్న ఎంఎల్సీల్లో ఎవరో ఒకరితో రాజీనామా చేయించే అవకాశం రేవంత్ కు ఉంది. ఈ విషయాన్ని రేవంత్‌కు పార్టీ అగ్రనేత రాహూల్ గాంధి చెప్పి చాలా కాలమైంది. అయినా రేవంత్ ఈఅవకాశాన్ని పట్టించుకోలేదనే ఆరోపణలు పెరిగిపోతాయి. ఇంతకాలం పట్టించుకోకుండా సమయం మించిపోతున్నపుడు హడావుడిగా రెండు ఎంఎల్సీ పేర్లను ఆమోదించాలని గవర్నర్‌ను రిక్వెస్టు చేయటంలో కుట్ర దాగుందని ప్రత్యర్ధులు దుమ్మెత్తిపోసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎవరితో అయినా రాజీనామా చేయించినా అజార్ ను ఆ ప్లేసులో నియమించేందుకు సమయం సరిపోదు. కాబట్టి రేవంత్ ముందున్న ఏకైక మార్గం ఏమిటంటే ప్రొఫెసర్, అజార్ పేర్లను ఆమోదిస్తు గవర్నర్‌తో సంతకం చేయించుకోవటమే.

రేవంత్‌ పై డీలిమిటేషన్ బిల్లు ఎఫెక్ట్

రేవంత్ రిక్వెస్ట్ పై డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన ఎఫెక్ట్ పడుతుందా అనే అనుమానాలు పెరిగిపోతోంది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. దాంతో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల బిల్లులను ఎన్డీయే ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా మొట్టమొదట గొంతెత్తింది రేవంత్ అన్న విషయం తెలిసిందే. దక్షిణాదిలోని మిగిలిన సీఎంలకు లేఖలు రాయటం, ఢిల్లీలో ఇతర పార్టీల నేతలతో మాట్లాడి డీలిమిటేషన్ ను వ్యతిరేకించేట్లుగా ఏకతాటిపైకి తీసుకురావటంలో రేవంత్ కీలకపాత్ర పోషించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవటంలో నరేంద్రమోదీ ప్రభుత్వం తప్పిదం ఉందా లేకపోతే వ్యూహాత్మక ఓటమికి సిద్ధపడిందా అన్నది పక్కన పెట్టేద్దాం.

డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవటానికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటమే కారణం. ఇండియా, నాన్ ఎన్డీయే పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావటంలో రేవంత్ యాక్టివ్ రోల్ ప్లే చేశాడు. అందుకనే రేవంత్ అంటే నరేంద్రమోదీ ప్రభుత్వంలో చాలామంది మండిపోతుండచ్చు. ఆ మంటను కేంద్రప్రభుత్వంలోని ముఖ్యులు గవర్నర్ ద్వారా చూపే అవకాశాలను కొట్టిపారేయలేము. రేవంత్ ఎన్నిసార్లు రిక్వెస్టులు చేసినా గవర్నర్ అంతిమంగా కేంద్రం ఏమిచెబితే అదే చేస్తారన్న విషయం తెలియంది కాదు. గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటకలో ఏమి జరిగిందో అందరు చూసిందే. తెలంగాణలో కూడా చాలాకాలంగా అదే జరుగుతోంది. అందుకనే రేవంత్ ప్రభుత్వం పంపిన ఫైలు లోక్ భవన్లోనే చాలాకాలంగా పెండింగులో ఉండిపోయింది.

రేవంత్ మీద కేంద్రంలోని ముఖ్యులు బదులు తీర్చుకోవాలని అనుకుంటే ఎంఎల్సీల సిఫారసు ఫైల్ పై గవర్నర్ సంతకం పెట్టరు. అప్పుడు అజార్ రాజీనామా అంశం రేవంత్ మెడకు చుట్టుకుంది. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లిం మైనారిటీలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయనటంలో సందేహంలేదు. అప్పుడు రేవంత్ కు చికాకైతే తప్పదు. మొత్తానికి అజార్ విషయంలో పదిరోజుల కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయినట్లే. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story