
‘రాజీవ్ యువ వికాసం’ యువతను మభ్యపెట్టడానికేనా?
కాంగ్రెస్ ప్రభుత్వం యువతను ఆకర్షించడానికి ఒక వ్యూహంతో ముందుకొచ్చింది.’రాజీవ్ యువ వికాసం’ పథకం కింద అర్హులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం తొలి విడతగా రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించబోతున్నామని ప్రకటించింది. నవంబర్ 19 నుంచి లబ్ధిదారులకు సాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.అయితే ఈ పథకం అమలు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగాల నోటిఫికేషన్ల అంశాలపై యువతలో ఉన్న అసంతృప్తి నేపథ్యంలో ఇది ఆ అంశాల నుండి డైవర్ట్ చేయడానికే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
దీని గురించి హెచ్సియు డిఎస్సి (దళిత్ స్టూడెంట్ యునియన్)లీడర్ రమేష్ తుంగా మాట్లాడుతూ ఈ పథకం కేవలం యువతని మభ్యపెట్టడానికే అని అన్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రీయిమ్బర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్లే హెచ్సియు లోనే వందలాది విద్యార్థులు అప్పులు చేసి డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నారని,వాళ్ళే తర్వాత నిరుద్యోగులుగా మారుతున్నారని అన్నారు. ఇప్పటివరకూ తెలంగాణాలో ఏ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు ఏం చేయలేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, ఫీజు రీయిమ్బర్స్మెంట్ విషయం నుండి డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని,వీటి మీద తమకి నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు.

