
రేణుక వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో సంచలనం(వీడియో)
బీఆర్ఎస్, బీజేపీలు పుంజుకుంటున్నట్లు చెప్పారు
రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత రేణుకా చౌధరి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి. ఇంతకీ విషయం ఏమిటంటే మంగళవారం పార్టీఆఫీసు గాంధీభవన్లో తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో కొందరు ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రేణుక మాట్లాడుతు బీఆర్ఎస్, బీజేపీలు పుంజుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్న కారణంగానే ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయి అని రేణుక చేసిన ప్రకటన కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి బీజేపీ బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టిందనే వ్యాఖ్య మరింత సంచలనంగా మారింది.
రేణుక తాజా వ్యాఖ్యలతో క్లారిటి వచ్చిన అంశాలు ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత మొదలైందని. అలాగే బీఆర్ఎస్, బీజేపీలు పుంజుకుంటున్నాయని. పార్టీలోని అసంతృప్త నేతలను బీజేపీ బుజ్జగిస్తోందని. ఇప్పుడే పార్టీ, ప్రభుత్వం గనుక మేలుకోకపోతే రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని రేణుక భావనగా అందరికీ అర్ధమైంది. రేణుక ఇంత స్పష్టంగా చేసిన వ్యాఖ్యలే ఇపుడు పార్టీ నేతలు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రెండు రోజుల క్రితం పార్టీ ఎంఎల్సీ, సినీనటి విజయశాంతి ఒక సమావేశంలో మాట్లాడుతు షాబాద్ మండలంలో జరిగిన ఆరుహత్యలకు పోలీసు శాఖే బాధ్యత వహించాలని చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టించాయి. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే పోక్సో కేసులో నిందితుడు ఆరుగురిని హత్య చేశాడని ఎంఎల్సీ ఆరోపించారు. ఇందుకు పోలీసుశాఖనే బాధ్యత తీసుకోవాలని విజయశాంతి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు పార్టీతో పాటు ప్రభుత్వంలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి.

