
కరీంనగర్ లో మోత మోగిపోవాల్సిందేనా ?
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇద్దరూ సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు
కరీంనగర్ జిల్లాలో సోమవారం మోత మోగిపోవాల్సిందే. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇద్దరూ సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇద్దరి పర్యటనలు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఒకేరోజు ఒకేజిల్లాలో ఇద్దరు పర్యటించటం మాత్రం బహుశా ఇదే మొదటిసారి. జగిత్యాల నియోజకవర్గం కేంద్రంలో కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఏ తాటిపర్తి జీవన్ రెడ్డి రేపు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. జీవన్‌రెడ్డి చేరిక సందర్భంగా బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నది. ఈభారీ బహిరంగసభకు ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే కేసీఆర్ హాజరవబోతున్నారు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా పార్టీ పటిష్టానికి అవసరమైన జోష్ నింపటానికే కేసీఆర్ బహిరంగసభకు హాజరవుతున్నారు. అందుకనే పార్టీ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టగా తీసుకున్నది.
ఇక రేవంత్ విషయం చూస్తే మంథని నియోజకవర్గంలోని మేడిగడ్డలో నిర్మించిన కాళేశ్వరం(కూలేశ్వరం అని రేవంత్ అంటున్నాడు) ప్రాజెక్టుతో పాటు అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులను పరిశీలించబోతున్నారు. సోమవారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, లోకల్ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తదితరులతో రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సైట్ దగ్గరే సమీక్ష నిర్వహించబోతున్నాడు. దీనికన్నా ముందు భూపాలపల్లిలో రెండోవిడత రైతు భరోసా విడతగా సుమారు 45 లక్షల మంది రైతులకు రు. 5650 కోట్లు విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా జరిగే సభ తర్వాత రేవంత్ కాళేశ్వరం చేరుకుంటాడు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరీంనగర్ మొదటినుండి ఉద్యమాల జిల్లా. ఈ జిల్లాలో జరిగే ఎంతటి చిన్న డెవలప్మెంట్ అయినా రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతుందనే పేరుంది. ఈ నేపధ్యంలో కాళేశ్వరం సైట్ లో రేవంత్ సమీక్ష, జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపే అవకాశముంది. కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుండగా, కేళేశ్వరం టార్గెట్ గా కేసీఆర్, హరీష్ రావు తదితరులను ఫిక్స్ చేయటానికి రేవంత్ ప్రభుత్వం పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేసీఆర్ దోచేసుకున్నాడని రేవంత్, మంత్రులు చాలాకాలంగా చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే.
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకూ పనికిరాకుండా పోయిందన్న విషయంపై జనాల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్ దోపిడీని సాంకేతికంగా నిరూపించేందుకు రేవంత్ చేసిన ప్రయత్నం ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చెల్లదంటు కేసీఆర్, హరీష్ తదితరులు వేసిన కేసులను హైకోర్టు విచారించి తీర్పును రిజర్వులో ఉంచింది. కోర్టు గనుక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తే వెంటనే కేసీఆర్, హరీష్ తదితరులపై ప్రభుత్వం యాక్షన్ మొదలుపెడుతుంది. అప్పుడు కేసీఆర్ తరపునుండి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి. రేవంత్ ను టార్గెట్ చేయటానికి కేసీఆర్ అండ్ కో ప్రయత్నిస్తుంటే, కేసీఆర్ ను టార్గెట్ చేస్తు రేవంత్, మంత్రులు తూటాలు పేల్చుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఇద్దరు ఒకేజిల్లాలో ఒకే రోజు పర్యటనలు ఆసక్తిని రేపుతున్నాయి.

