
కేరళ ప్రచారంలో రేవంత్ సూపర్ హిట్
కడపటి వార్తలు అందే సమయానికి 140 అసెంబ్లీ సీట్లున్న కేరళలో యూడీఎఫ్ 98 సీట్లతో ముందంజలో ఉంది
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కేరళలో చేసిన ప్రచారం సూపర్ హిట్టనే చెప్పాలి. ఎలాగంటే సోమవారం వెలువడిన నాలుగురాష్ట్రాలు, పాండిచ్చేరి ఎన్నికలఫలితాల్లో కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. కడపటి వార్తలు అందే సమయానికి 140 అసెంబ్లీ సీట్లున్న కేరళలో యూడీఎఫ్ 98 సీట్లతో ముందంజలో ఉంది. ఏ పార్టీ లేదా కూటమి అధికారంలోకి రావాలంటే 71 సీట్లకు పైగా సీట్లు సాధిస్తే సరిపోతుంది. అలాంటిది ఇపుడు కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ఏకంగా 98 సీట్లలో మెజారిటిలో ఉందంటే అధికారంలోకి వచ్చేసినట్లే అనుకోవాలి.
కేరళ ఎన్నికలకు రేవంత్ కు ఏమిటి సంబంధం ? ఏమిటంటే కేరళలో కాంగ్రెస్ అభ్యర్ధుల విజయానికి రేవంత్ బాగా కష్టపడ్డాడు. 10 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయటమే కాకుండా మరో నాలుగు నియోజకవర్గాల్లో రోడ్డుషోల్లో కూడా పాల్గొన్నాడు. కోవళం, తిరువనంతపురం, మావేలికర, పథనాపురం, నేమం లాంటి నియోజకవర్గాల్లో ప్రచారంతో పాటు భారీ రోడ్డుషోలు కూడా నిర్వహించారు. పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా కేరళంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగటంలేదని, సంక్షేమ పథకాల అమలును తెలంగాణలో చూసి తెలుసుకోవాలని రేవంత్ ప్రజలకు పిలుపిచ్చారు. రేవంత్ పిలుపుకు కూడా పనరయి విజయన్ ఉలిక్కిపడ్డారంటేనే ఆశ్చర్యంగా ఉంది. రేవంత్ ప్రచారం అంతా ఎన్నికల స్టంటే అని విజయన్ ప్రత్యారోపణ చేయటంతోనే సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ పరిస్ధితి అర్ధమైపోయింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేరళలో ప్రచారానికి రేవంత్ ఎందుకింత ప్రాధాన్యత ఇచ్చినట్లు ? ఎందుకంటే నాలుగు కారణాలున్నాయి. ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ అధికారంలోకి రావటం ఖాయమని సర్వేల్లో తేలటం. రెండోది కాంగ్రెస్ అగ్రనేత ప్రయాంకాగాంధీ కేరళలోని వాయనాడు ఎంపీగా ఉండటం. ఇక మూడో పాయింట్ ఏమిటంటే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో రేవంత్ కు ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలు. అత్యంత కీలకమైననాలుగో పాయింట్ ఏమిటంటే రేవంత్ కు ప్రచారంలో భాషా సమస్య లేకపోవటం. కేరళంలో సుమారు 22శాతం ముస్లిం ఓటర్లున్నారు. రేవంత్ ప్రచారంలో ఎక్కువగా ముస్లిం ప్రాబల్యమున్న నియోజకవర్గాలు ఏరియాల్లోనే జరిగింది.
రేవంత్ కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే చెప్పదలచుకున్నది సూటిగా, సుత్తిలేకుండా చెప్పగలగటం. ప్రత్యర్ధులపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడేటపుడు డైరెక్ట్ ఎటాక్ చేస్తుంటాడు. కాబట్టి రేవంత్ చెప్పేది జనాలకు డైరెక్టుగా అర్దమవుతుంది. కార్పొరేట్ భాషలో చెప్పాలంటే రేవంత్ ఇందులో మాస్టర్ అనే చెప్పాలి. క్లాస్ తో మాట్లాడేటపుడు క్లాస్ భాషలోను, మాస్ తో మాట్లాడేటపుడు మాస్ భాషలోను చక్కగా అర్ధమయ్యేట్లుగా చెప్పగలడు. తాజా ఫలితాలను గమనిస్తే జనాలకు కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ మీద ప్రేమకన్నా ముఖ్యమంత్రిగా విజయన్ పాలనపై విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయినట్లు అర్ధమవుతోంది.
విజయన్ అల్లుడు మహమ్మద్ రియాస్ ను మంత్రివర్గంలోకి తీసుకోవటం పార్టీలోనే చాలామందికి నచ్చలేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాగే పినరయి కూతురు వీణా విజయన్ ఐటి కంపెనీకీ కోట్ల రూపాయలు మళ్ళించారనే ఆరోపణలు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, దేవాలయంలో బంగారం మాయంకేసులో ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ప్రమేయం లాంటి అనేక ఆరోపణలతో జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయినట్లు అర్ధమవుతోంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ చక్కగా అడ్వాంటేజ్ తీసుకుని అధికారంలోకి వస్తోంది.

