
హనుమంతరావుకు రేవంత్ ప్రభుత్వం గుర్తింపు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురువారం వీహచ్‌ను బీసీసంక్షేమ, అభివృద్ధి సలహాదారుగా నియమించింది
కాంగ్రెస్ లో సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వీ హనుమంతరావు @వీహెచ్‌కు కీలక పదవి దక్కింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురువారం వీహచ్‌ను బీసీసంక్షేమ, అభివృద్ధి సలహాదారుగా నియమించింది. బీసీ నేతగా తెలంగాణ రాజకీయాల్లో వీహెచ్ అంటే తెలియని వారండరు అనటం అతిశయోక్తి కాదు. యువజన కాంగ్రెస్ కార్యకర్తగా తర్వాత కాంగ్రెస్ నేత, ఎంఎల్సీగా, ఎంఎల్ఏ, మంత్రి పదవి తర్వాత మూడుసార్లు రాజ్యసభ ఎంపీ అయ్యారు. అబంర్ పేట నుండి రెండుసార్లు ఎంఎల్ఏగా గెలిచి ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. సమైక్య రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2016లో మూడోసారి ఎంపీ పదవీకాలం పూర్తయిన తర్వాత ప్రభుత్వంలో పదవి అందుకోవటం ఇదే మొదటిసారి.
మొదటినుండి పార్టీకార్యక్రమాల్లో బిజీగా, యాక్టివ్‌గా ఉండే వీహెచ్ అటు అధిష్ఠానం పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతునే ఇటు నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజలకు కూడా అంతే సన్నిహితంగా ఉండేవారు. భోళాశంకరుడు పేరును వీహెచ్ ఉన్నదున్నట్లు మొహంమీదే మాట్లాడేస్తాడు అనే పేరు కూడా సంపాదించుకున్నారు. వీహెచ్‌ను మీడియా ఫ్రెండ్లీ అనిచెప్పాలి.
యువజన కాంగ్రెస్ లో చురుకుగా పనిచేసిన వీహెచ్ 1978-83లో మొదటిసారి హైదరాబాద్ నగరంలోని అంబర్ పేట నియోజకవర్గంలో ఎంఎల్ఏగా గెలిచారు. 1979-83లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత పీసీసీ సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన తర్వాత కార్యదర్శి అయ్యారు. 1989లో రెండోసారి ఎంఎల్ఏగా గెలిచి క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా నియమితులవ్వటంతో మంత్రి పదివికి రాజీనామా చేశారు.
ఆతర్వాత 1992-98లో మొదటిసారి రాజ్యసభ ఎంపీగా నియమితులయ్యారు. మళ్ళీ 2004-10లో రెండోసారి ఎంపీగా నామినేట్ అయ్యారు. మూడోసారి 2010-16 మధ్య రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 2004లో ఏఐసీసీ కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. వీహెచ్ యువజన కాంగ్రెస్ తో రాజకీయ అరంగేట్రం మొదలుపెట్టిన దగ్గర నుండి ఎన్నో పార్టీలు ఏర్పాటైనా నిబద్దత గలిగిన నేతగా కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతున్నారు. ఇతర పార్టీల నుండి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎప్పుడూ పక్కకు చూడలేదు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, తనకు పదవి వచ్చినా రాకపోయినా వీహెచ్ మాత్రం కాంగ్రెస్ ను వీడలేదు. అంకితభావం, క్రమశిక్షణకు గుర్తింపుగానే ఇపుడు రేవంత్ ప్రభుత్వం వీహెచ్ ను బీసీ సంక్షేమ సలహాదారుడిగా నియమించింది.

