x

ప్రైవేటు స్కూళ్ళకు షోకాజ్ నోటీసులు

ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలపై ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ అయ్యింది.


ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలపై ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ అయ్యింది. స్కూళ్ళ యాజమాన్యాలకు పాఠశాల విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీచేస్తోంది. కారణం ఏమిటంటే విద్యాశాఖ ఆదేశాలను లెక్కచేయకపోవటమే. తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్‌ప్రకారం ప్రతి విద్యాసంవత్సరం ముగియగానే యాన్యువల్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్టును ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు విద్యాశాఖకు అందచేయాలి.

మూడేళ్ళ డేటాను విద్యాశాఖ వెబ్ పోర్టల్లో పెట్టడమే కాకుండా స్కూల్ వెబ్ సైట్ లో కూడా అప్ లోడ్ చేయాలి. యాన్యువల్ రిపోర్టు డేటాలో స్కూల్లో చదువుతున్న విద్యార్ధుల సంఖ్య, ఏ తరగతికి ఎంత ఫీజు వసూలుచేస్తున్నారు, ఎంతమంది క్వాలిఫైడ్ టీచర్లున్నారు అనే విషయాలన్నీ ఉండాలి. ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వానికి తెలియటం ఇష్టంలేకే వేలాది ప్రైవేటుస్కూళ్ళ యాజమాన్యాలు డేటాను ఇవ్వటంలేదు.

ప్రభుత్వఆదేశాలను వేలాది స్కూళ్ళయాజమాన్యాలు ఏమాత్రం లెక్కచేయటంలేదు. రాష్ట్రంలో 13,677 స్కూళ్ళుండగా ఆడిట్ డేటాను ఇచ్చిన స్కూళ్ళు కేవలం 166 మాత్రమే. 9 జిల్లాల్లోని స్కూళ్ళ యాజమాన్యాలు కనీసం ఒక్క ఏడాది కూడా ఆడిట్ రిపోర్టు ఇవ్వలేదు. 2023-24 ఆడిట్ లెక్కలను 147 స్కూళ్ళు ఇచ్చాయి. 2024-25లో 162 స్కూళ్ళిచ్చాయంతే.

ఆడిట్ రిపోర్టును ప్రభుత్వానికి సబ్మిట్ చేయటానికి యాజమాన్యాలకు ప్రతి ఏడాది జూలై 30వ తేదీ ఆఖరుతేదీ. అయితే వేలాది స్కూళ్ళు అసలు ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయటంలేదు. అందుకనే ఆడిట్ డేటాను సమర్పించని స్కూళ్ళకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీచేస్తోంది. నోటీసులకు సరైన సమాధానాలు చెప్పకుండా ఆడిట్ డేటాను వెంటనే సబ్మిట్ చేయని స్కూళ్ళ గుర్తింపును రద్దు చేస్తామని ప్రభుత్వం నోటీసుల్లో హెచ్చరిస్తోంది. మరిపుడైనా స్కూళ్ళ యాజమాన్యాలు ఆడిట్ డేటాను సబ్మిట్ చేస్తాయేమో చూడాలి.

Read More
Next Story