
స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్…ప్రభుత్వ ఖజానా నింపే రేవంత్ కొత్త వ్యూహం
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవటానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరో మార్గాన్ని ఎంచుకున్నారు. అదేమిటంటే ప్రభుత్వానికి ప్రతినెలా రావాల్సిన ఆదాయాలను నూరుశాతం రాబట్టుకోవటమే. ఇందుకోసమే ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్’ను ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ వింగ్ ఏమిచేస్తుందంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలను నూరుశాతం రాబడుతుంది. ప్రభుత్వానికి ఆదాయాలను అందించే శాఖలు ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, రెవిన్యు, మున్సిపాలిటీనే. ప్రస్తుతం వీటినుండి రావాల్సినంత ఆదాయాలు రావటంలేదని రేవంత్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో నెలకు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు తగ్గుతోందని స్వయంగా రేవంతే ప్రకటించారు. అంటే ఏడాదికి రు. 12 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతున్నట్లు లెక్క.
ప్రభుత్వం దగ్గర రు. 12 వేల కోట్లుంటే సంక్షేమ పథకాలు లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చులు పెట్టగలదు అని రేవంత్ అన్నారు. ఈ లీకేజీలను అరికట్టి నూరుశాతం పన్నులను వసూలు చేయటమే లక్ష్యంగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ను ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ వింగ్ ఏర్పాటుకు అవసరమైన విధి, విధానాలను తయారుచేయాలని, అవసరమైతే అసెంబ్లీలో బిల్లుపెట్టి చట్టంగా రూపొందిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ ప్రకటించారు. ఈమధ్య కాలంలో బాగా యాక్టివ్ అయిన ఏసీబీ ఉన్నతాధికారులు ఇరిగేషన్, రెవిన్యు, రిజిస్ట్రేషన్ల శాఖల్లోని ఉన్నతాధికారుల మీద దాడులు చేసినపుడు వందల కోట్ల రూపాయల సంపాదన బయటపడుతున్న విషయం తెలిసిందే. ఇలా బయటపడుతున్న సంపదను ప్రభుత్వ ఖాతాలో వీలైనంత తొందరగా జమయ్యే విషయంలో కూడా చట్టంలో మార్పులు చేయాలని రేవంత్ ఆలోచిస్తున్నారు. ఇపుడు అక్రమార్కుల సంపాదన ప్రభుత్వ ఖజానాకి అందాలంటే సంవత్సరాలు పడుతోంది. పై రెండు అంశాల్లో రేవంత్ ఆలోచన చూస్తుంటే ప్రభుత్వానికి కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతున్నట్లే అర్ధమవుతోంది.
అయితే ఈ కొత్త ఏర్పాటు వల్ల మేలు ఏంటి ?ముప్పు ఏంటి? దీని మీద రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ప్రసాద శాస్త్రి గారితో చర్చ.

