అభివృద్ధిలో దేశంలోనే కొడంగల్ నెంబర్ వన్
x

అభివృద్ధిలో దేశంలోనే కొడంగల్ నెంబర్ వన్

2027 డిసెంబర్ కు కొడంగల్ లోని అన్నీ అభివృద్ధి పనులు పూర్తి కావాల్సిందే అని డెడ్ లైన్ విధించారు.


కొడంగల్ లో భారీ పరిశ్రమలు రాబోతున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రేవంత్ పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయం పునరుద్ధరణ పనులను రేవంత్ ప్రారంభించారు. అలాగే దౌలతాబాద్, కోస్గిలో దేవాలయాల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్ధాపన చేశారు. కొడంగల్ లో ఆసుపత్రి నిర్మాణానికి కూడా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతు దేశంలోని ప్రముఖ కంపెనీలు కొడంగల్ లో ఏర్పాటు కాబోతున్నట్లు చెప్పారు. నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధిని ఇక్కడ జనాలు తనతో పాటు జిల్లా మంత్రి, ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఉన్నతాధికారుల వెంటపడి చేయించుకోవాలని చెప్పారు.

రాష్ట్రంలోని పెద్దకుర్చీ(సీఎం పోస్టు) వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గంకు వచ్చినపుడు అడిగి మరీ అభివృద్ధి చేసుకోకపోతే జనాల తప్పే అవుతుందని రేవంత్ చురకలంటించారు. తన నియోజకవర్గం అభివృద్ధికి తాను పాటుపడతానని అలాగని మిగిలిన వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండకూడదని గట్టిగా చెప్పారు. రోడ్లు, బడులు, గుడులతో పాటు పరిశ్రమలను కూడా కొడంగల్ కు తీసుకొచ్చే బాధ్యత తనదే అని అన్నారు.

2009లో మొదటిసారి తనను ఎంఎల్ఏగా గెలిపించేందుకు ఎంతోమంది కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చినట్లు గుర్తుచేసుకున్నారు. కొడంగల్ నియోజకవర్గం అంటే ఒకవైపు గుడి మరోవైపు గడీ ఉండేదన్నారు. అలాంటిది ఇపుడు గుడి, గడి ఏకమై కొడంగల్ ను ఒక నందనవనంగా, పాడి పంటలతో విలసిల్లేలా ముందుకు తీసుకెళ్ళేందుకు తనతో కలిసినట్లు చెప్పారు. మాజీ ఎంఎల్ఏ నందారం సూర్యనారాయణ వెంటకేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి టీటీడీ నుండి నిధులు తెచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తుచేసుకున్నారు.

కొడంగల్ అభివృద్ధి కోసం గతంలో ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎలాంటి ఉపయోగంలేకపోయిందన్నారు. ఇపుడు తానే సీఎం అయ్యాను కాబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పై స్ధాయిలో నిలబెడతానని ప్రకటించారు. రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు, రేషన్ కార్డుల పంపిణీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు రేవంత్ తెలిపారు. పేదల వైద్యం, విద్య కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ఒకపుడు కొడంగల్ లో చదువుకునే అవకాశాలు లేక వికారాబాద్ లేదా పరిగి వెళ్ళే వారని ఇపుడు అలాంటి అవసరం ఉండదన్నారు. కొడంగల్ రాష్ట్రంలోనే ఎత్తయిన ప్రాంతంలో ఉండటంతో నీళ్ళు వచ్చే అవకాశం లేకపోవటంతో కేవలం కందులు తప్ప ఇంకేమీ పండించేవారు కాదన్నారు.

అలాంటిది ఈరోజు నియోజకవర్గంలో చాలా ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు నారాయణపేట ప్రాజెక్టును తీసుకొస్తున్నట్లు చెప్పారు. నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నర లోపు పూర్తిచేసి కృష్ణా నదీజలాలను పారిస్తానని హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకంకు అవసరమైన భూసేకరణ బాధ్యత మంత్రి శ్రీహరికి అప్పగిస్తే నెలలోపే పూర్తిచేసినట్లు రేవంత్ ప్రశంసించారు. ప్రతి తండా, గ్రామానికి రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వికారాబాద్ రైల్వేలైన్ 90శాతం పూర్తయిందన్నారు. సిమెంట్ పరిశ్రమ వచ్చే ఆరునెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటుందని తెలిపారు. మెడికల్, ఇంజనీరింగ్, ఏటీసీ సెంటర్, నర్సింగ్ కాలేజ్, పాలిటెక్నిక్, సైనిక్ స్కూల్ లాంటి ఎన్నో విద్యాసంస్ధలు కొడంగల్ లో ఏర్పాటవుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి విద్యార్ధులు చదువుకోవటానికి కొడంగల్ వచ్చేలా అభివృద్ధి చేస్తానన్నారు.

2300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ను లగచర్ల దగ్గర ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఎయిర్ పోర్ట్ నుండి కొడంగల్ కు పెద్ద రోడ్డు కూడా వస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్నీపార్టీల నేతలు ఒకటై నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపిచ్చారు. 2027 డిసెంబర్ కు కొడంగల్ లోని అన్నీ అభివృద్ధి పనులు పూర్తి కావాల్సిందే అని డెడ్ లైన్ విధించారు.

Read More
Next Story