చంద్రబాబుకు రేవంత్ వార్నింగ్
x
Revanth and Chandrababu Naidu

చంద్రబాబుకు రేవంత్ వార్నింగ్

బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా భవిష్యత్తులో చంద్రబాబు పరిస్ధితి కూడా నితీష్ కుమార్, ఏక్‌నాథ్ షిండేలాగే అయిపోతుందని జోస్యం కూడా చెప్పాడు


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం హెచ్చరించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతు ‘‘బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుంది’’ అని అన్నాడు. తెలుగుదేశంపార్టీ, చంద్రబాబునాయుడుకు కూడా ఇందులో మినహాయింపు ఉండదు అన్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా భవిష్యత్తులో చంద్రబాబు పరిస్ధితి కూడా నితీష్ కుమార్, ఏక్‌నాథ్ షిండేలాగే అయిపోతుందని జోస్యం కూడా చెప్పాడు. బీజేపీకి ఇపుడు పార్లమెంటులో తక్కువ సీట్లున్నాయి కాబట్టి టీడీపీకి ప్రధాన్యం ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పాడు.

లోక్‌సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయటానికి మాత్రమే అని రేవంత్ గుర్తుచేశాడు. వాటిని అమల్లోకి తీసుకొచ్చేది స్ధానికంగా ఉండే రాష్ట్రప్రభుత్వాలు, అధికార యంత్రాంగమే అని స్పష్టంచేశాడు. 2/3 మెజారిటి వచ్చినంత మాత్రాన అన్నింటినీ చట్టాలుగా మార్చలేమని ఎద్దేవాచేశాడు. మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న వాళ్ళు ఎవరైనా తనకు తాను రాజుగా భావించుకుని 2/3 వంతు మెజారిటితో చట్టం చేయచ్చని అనుకుంటే ఎవరూ ఒప్పుకోరు కదా ? అని సూటిగా ప్రశ్నించాడు. డిక్టేటర్ షిప్పును ఎవరూ అంగీకరించే అవకాశంలేదు అన్నాడు.

మొత్తంమీద తన మాజీబాస్ రాజకీయ జీవితం ఏమిటో రేవంత్ ఈరోజు కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. అయినా చంద్రబాబు వయసు 75 ఏళ్ళు. మహాయితే వచ్చేఎన్నికల వరకు యాక్టివ్ గా ఉండగలరేమో. ఇంతోటిదానికి చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు కూడా నితీష్ కుమార్, ఏక్ నాథ్ షిండే లాగ అయిపోతుందని మరీ భయపెట్టాల్సిన అవసరం లేదేమో అనిపిస్తోంది. రేవంత్ చెప్పిన పోలికల్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఈమధ్యనే రాజీనామా చేసి రాజ్యసభ ఎంపీ అయ్యారు. తొందరలోనే కేంద్రమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి చంద్రబాబుకు నితీష్ తో పోలిక అంతగా నప్పలేదేమో. ఇక ఏక్‌నాథ్ షిండే అంటారా ఈపోలిక మరీ అన్యాయంగా ఉంది. అయినా అందరి సరదాలను కాలం తప్పక తీర్చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఎవరేమి అవుతారో చూడాల్సిందే.

Read More
Next Story