వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లపై రేవంత్ స్పెషల్ ఫోకస్
x

వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లపై రేవంత్ స్పెషల్ ఫోకస్

కార్పోరేట్ ఎన్నికలే లక్ష్యమా?


హైదరాబాద్‌కు ధీటుగా తెలంగాణలోని ద్వితీయశ్రేణి నగరాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాలను అనుసంధానిస్తూ ప్రత్యేక "ఎకనామిక్ గ్రోత్ కారిడార్" మాస్టర్ ప్లాన్ ను రెడీచేస్తోంది. ఈనగరాలలో ట్రాఫిక్ సమస్యలను నివారించి, పారిశ్రామిక వికాసానికి ఊతమిచ్చేలా హైదరాబాద్ తరహాలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్లు నిర్మించేందుకు డిపిఆర్‌లు సిద్ధమవుతున్నాయి. గ్రోత్ క్యారిడార్ అమలు నిధులు మొత్తం కేంద్రప్రభుత్వమే భరిస్తుంది. 'అర్బన్ ఛాలెంజ్ ఫండ్' ద్వారా రూ. 14,000 కోట్ల కోసం రేవంత్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా మొదటి విడతలో ఐదు ప్రాజెక్టులకు రూ. 5,681.04 కోట్లకు ఆమోదం లభించింది. మొదటి విడతగా 25% వాటా రూ. 1,420.26 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసింది.


నల్గొండ-యాదగిరిగుట్ట ప్రాంతాలను కలుపుతూ 'టెంపుల్ కారిడార్', ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను అనుసంధానిస్తూ 'టూరిజం కారిడార్', మహబూబ్‌నగర్-భూత్పూర్-జడ్చర్ల ప్రాంతాలతో ఒక పారిశ్రామిక కారిడార్, మరియు కొత్తగూడెం-పాల్వంచ-సుజాతనగర్‌లతో మరొక ఎకనామిక్ కారిడార్ లకు కూడా రూపకల్పన చేస్తోంది. వీటితో పాటు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పరిధిలోని సిడిఎంఎ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను కేంద్రీకరించి, పారిశ్రామిక, వ్యవసాయాధారిత రంగాలు, రియల్ ఎస్టేట్‌కు ఊతమిచ్చేలా ప్రత్యేక క్లస్టర్లు, డెవలప్‌మెంట్ జోన్ల నిర్మాణానికి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ప్రత్యేక మాస్టర్ ప్లాన్లను రూపొందిస్తోంది.

అయితే వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ల ఎన్నికలు రానున్న సమయంలోనే రేవంత్ రెడ్డి గ్రోత్ క్యారిడార్ అమలుకు శ్రీకారంచుట్టడం ఆసక్తికరంగా మారింది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ ల మధ్య తీవ్రపోటీ ఉంది. ఈ నగరాల్లో గతంలో బిఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో నాయకులచేరికలు సమీకరణాల మార్పుతో కాంగ్రెస్ తన పట్టును విపరీతంగా పెంచుకుంది. అయితే ఈ క్యారిడార్ అమలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమేరకు సానుకూలంగా ఉంటుందో చూడాలి.



Read More
Next Story