అసెంబ్లీ వ్యవహారాలపై కోర్టుల్లో పెరిగిపోతున్న కేసులు
అసెంబ్లీలోకి ప్రవేశించకుండా తమను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు హైకోర్టులో కేసు దాఖలుచేశారు
అసెంబ్లీ వేదికగా తలెత్తుతున్న అనేక వివాదాలు చివరకు హై కోర్టులో కేసులుగా మారుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు దాఖలు చేయటంతో అందరి దృష్టి అసెంబ్లీ-హైకోర్టు మీదకు మళ్ళుతోంది. అసెంబ్లీలోకి ప్రవేశించకుండా తమను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు హైకోర్టులో కేసు దాఖలుచేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తమవిధులకు హాజరవ్వకుండా ఎంఎల్ఏలను అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని చెప్పింది. ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదావేసింది.
గతంలో కూడా ఇలాంటి కేసులు హైకోర్టు నుండి సుప్రింకోర్టు వరకు వెళ్ళాయి. 2018లో కాంగ్రెస్ ఎంఎల్ఏలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ పై బీఆర్ఎస్ హయాంలో స్పీకర్ వేటువేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతున్నారన్న కారణంతోనే స్పీకర్ ఇద్దరు ఎంఎల్ఏలపై వేటువేశారు. స్పీకర్ నిర్ణయంపై ఇద్దరు ఎంఎల్ఏలు హైకోర్టులో కేసులు దాఖలుచేశారు. స్పీకర్ వేటు వేసిన నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. అయితే ప్రభుత్వం సుప్రింకోర్టులో రివ్యూ దాఖలు చేసింది.
తర్వాత 2022లో బీజేపీ ఎంఎల్ఏలు ఈటల రాజేందర్, రఘనందనరావు, రాజాసింగ్ పైన బీఆర్ఎస్ హయాంలో స్పీకర్ బడ్జెట్ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ చెల్లదంటు ముగ్గురు ఎంఎల్ఏలు కోర్టులో కేసులు వేశారు. విచారణ తర్వాత స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వటానికి హైకోర్టు నిరాకరించింది. ఇపుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏ హరీష్ రావు తదితరులు దాఖలుచేసిన కేసులో విచారణ సందర్భంగా కోర్టు ఏమి తీర్పుచెబుతుందో చూడాలి.

