సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు సరూర్‌నగర్ సిద్ధం
x

సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు సరూర్‌నగర్ సిద్ధం

సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే సభకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. సామాజిక వైతాళికుల చిత్రపటాలతో సభా ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.


సామాజిక న్యాయ తెలంగాణ లక్ష్యంగా నిర్వహించనున్న సంకల్ప సభకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం సిద్ధమవుతోంది. గురువారం జరగనున్న ఈ సభ కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని సామాజిక వైతాళికుల చిత్రపటాలతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సభకు శ్రీకారం చుట్టనున్నారు. భౌగోళిక తెలంగాణను సామాజిక న్యాయ తెలంగాణగా పునర్నిర్మించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధి, సాధికారత ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు.

సమాజంలోని అన్ని వర్గాల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త రాజకీయాలకు నాంది పలకాలనే ఆలోచనతో సభను నిర్వహిస్తున్నట్లు సమాచారం. అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యాన్ని కూడా వెల్లడిస్తున్నారు. సభా ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, మహాత్మా జ్యోతిబా పూలే, మాతా సావిత్రిబాయి పూలే, భాగ్యరెడ్డి వర్మ చిత్రపటాలను ఏర్పాటు చేస్తున్నారు.

అలాగే చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, కాన్షీరామ్, కొమురం భీమ్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కర్పూరి ఠాకూర్ చిత్రపటాలకు కూడా సభలో స్థానం కల్పిస్తున్నారు. ఇవే కాకుండా టీఎన్ సదాలక్ష్మి, పండుగ సాయన్న, వడ్డెర ఓబన్న, సంత్ సేవాలాల్ మహరాజ్, సంగం లక్ష్మీబాయి, షోయబుల్లాఖాన్, మారోజు వీరన్న, మఖ్దూం మొహియుద్దీన్ చిత్రపటాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక న్యాయ తెలంగాణ అంశాన్ని కేంద్రంగా చేసుకుని నిర్వహిస్తున్న ఈ సభపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కార్యక్రమంలో ప్రతిపాదించే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

Read More
Next Story