
సూర్య చేసిన గాయానికి శోభమ్మ మందు
ఏపీ-తెలంగాణ విభజనను పాకిస్ధాన్ విభజనతో పోల్చాడు
బెంగుళూరు సౌత్, బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ గురించి అనుచితంగా మాట్లాడినందుకు ఆదివారం కేంద్రమంత్రి శోభా కరంజ్లాదే క్షమాపణలు చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సందర్భంగా లోక్‌సభలో అసందర్భంగా తెలంగాణ విభజనపై తేజస్వి నోటికొచ్చింది మాట్లాడిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడమంటే ఎంపీ ఏమో ఏపీ విభజన గురించి మాట్లాడాడు. ఏపీ-తెలంగాణ విభజనను పాకిస్ధాన్ విభజనతో పోల్చాడు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ఉదహరిస్తు, బ్రిటీష్ వాళ్ళు పాకిస్ధాన్ విభజన కన్నా కాంగ్రెస్ చెత్తగా చేసింది అంటు సందర్భంలేకుండా ఏదేదో మాట్లాడాడు. దానిపైన సభలోనే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు, హైదరాబాద్ లోని మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
తేజస్విని ఎంపీగా బర్త్ రఫ్ చేయాలంటు మంత్రి పొన్నం ప్రభాకర్ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. అలాగే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ముందు తేజస్వీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన చేశారు. అసలు అంశం మహిళా రిజర్వేష్ బిల్లు అయితే పానలకంలో పుడక లాగ ఏమీ సంబంధంలేకుండానే తేజస్వీ తెలంగాణ ఏర్పాటు గురించి అనవసరంగా మాట్లాడాడు. దాంతో రెండురోజులు ఇటు హైదరాబాదులో అటు ఢిల్లీలో పార్లమెంటు ముందు నానా గోలయ్యింది. తన మాటలను సూర్య సమర్ధించుకుంటు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు కాని జనాలు దాన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇంత గోలచేస్తున్నా బీజేపీ ఎంపీలు, ఎంఎల్ఏలు, అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు కనీసం నోరుకూడా ఎత్తకపోవటం గమనార్హం.
ఈ వివాదం ఇలా నడుస్తుండగానే ఆదివారం కేంద్రమంత్రి, కర్నాటక ఎంపీ శోభా కరంజ్లాదే మీడియాతో మాట్లాడుతు తెలంగాణ గురించి తేజస్వీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. తేజస్వి వ్యాఖ్యలు తనను కూడా బాధించాయని అన్నారు. ఎంపీ వ్యాఖ్యలతో ఏపీ, తెలంగాణ ప్రజల మనసులు గాయపడ్డాయని తనకు అర్ధమైంది అన్నారు. అందుకనే వివాదానికి ముగింపు పలికేందుకు ఎంపీ తరపున తాను క్షమాపణలు చెప్పినట్లు కేంద్రమంత్రి వివరణ ఇచ్చారు.

