
అస్తవ్యస్తంగా మారిన 'సర్' ప్రక్రియ
రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన 'సర్' ప్రక్రియ గందరగోళంగా మారి అస్తవ్యస్తంగా సాగుతోంది. వివరాల్లో తప్పులు ఉన్నట్టు గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, అధికారులు చేపడుతున్న విచారణ ప్రక్రియ ఓటర్లకు తీవ్ర తిప్పలు తెచ్చిపెడుతోంది. అధికారుల వద్దకు పదేపదే తిరగాల్సి రావడం, అవసరమైన ధ్రువపత్రాలు చూపలేకపోవడం, పరిశీలనపై ఆసక్తి లేకపోవడం వంటి కారణాల వల్ల దాదాపు 90 శాతం మంది ఓటర్లు విచారణకు వెళ్లడం లేదని తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా వివరాల్లో తప్పులు ఉన్నట్టు అధికారులు మొత్తం 92.88 లక్షల మంది ఓటర్లను గుర్తించారు. అయితే, అందులో ఇప్పటివరకు కేవలం 30.75 లక్షల మందికి మాత్రమే నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్న వారిలో ఏకంగా 17.13 లక్షల మంది అసలు విచారణకే హాజరుకాకపోవడంతో, వారికి ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయింది. విచారణ ప్రక్రియ మంగళవారం నాటికి కేవలం 1.73 లక్షల మంది ఓటర్లకు (సుమారు 6 శాతం మందికి) మాత్రమే ప్రారంభమైంది.
పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఈ ప్రక్రియ మరీ మందకొడిగా సాగుతోంది. హైదరాబాద్ జిల్లాలో సిద్ధం చేసిన 12.53 లక్షల నోటీసుల్లో కేవలం 5.30 లక్షల నోటీసులు మాత్రమే అందజేయగా, 1.52 లక్షల నోటీసుల్లో గడువు ముగిసింది. విచారణ మొదలైన ఓటర్లలో ఇప్పటివరకు కేవలం 20,199 మందికి మాత్రమే ప్రక్రియ పూర్తయింది. హాజరుకాని ఓటర్లకు మరోసారి నోటీసులు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

