
బండి భగీరథకు సిట్ నోటీసులు
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీర్ బాద్ పోలీసు స్టేషన్లో విచారణకు హాజరుకావాలని నోటీసులో సిట్ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథకు సిట్ అధికారులు మంగళవారం రాత్రి నోటీసులు జారీచేశారు. రేపు అంటే బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీర్ బాద్ పోలీసు స్టేషన్లో విచారణకు హాజరుకావాలని నోటీసులో సిట్ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. మైనర్ తనపై అత్యాచార ప్రయత్నంచేయటం, డ్రగ్స్, మద్యం తాగించటం లాంటి ఆరోపణలతో భగీరథపై ఒక మైనర్ బాలిక ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ అమ్మాయి ఫిర్యాదుచేసిన విషయం తెలుసుకుని భగీరథ కూడా అమ్మాయిపై కరీంనగర్ పోలీసుస్టేషన్లో హనీట్రాప్ ఆరోపణలతో ఫిర్యాదు చేశాడు.
బాలిక ఫిర్యాదుతో పోలీసులు భగీరథపై పోక్సో కేసు నమోదుచేశారు. తనపైన పోక్సో కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్నప్పటి నుండి నిందితుడు మాయమైపోయాడు. పోలీసులు ఎంత వెతుకుతున్నా కనబడటంలేదు. ఎక్కడున్నాడో తెలీకపోవటంతో సిట్ అధికారులు భగీరథ ఇంటికి నోటీసులు సర్వ్ చేశారు. భగీరథ పోక్సో కేసులో ఇరుక్కోవటం తెలంగాణలో రాజకీయ వివాదం పెరిగిపోయింది. ప్రధాన ప్రతిపక్షం భగీరథను అరెస్టుచేయాలంటు నానా గోలచేస్తున్నది. కాంగ్రెస్ నుండి పోలీసులపై ఒత్తిడి అంతగా లేకపోయినా బీఆర్ఎస్ నేతలు మాత్రం బాగా ఒత్తిళ్ళు పెడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ కు కూకట్ పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. నోటీసులకు నిందితుడు ఏ విధంగా స్పందిస్తాడనే విషయం ఇపుడు ఆసక్తిగా మారింది.

