
‘మీ పంచాయితీల్లోకి మిమ్మల్ని లాగొద్దు’
మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. మంత్రులపై వార్తలు రాసేముందు తన వివరణ తీసుకోవాలని అన్నారు.
సింగరేణి టెండర్లపై కావాలనే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మంత్రులపై ఆరోపణలు చేసే ముందు ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలని మీడియాకు సూచించారు. తమ పాలనలో అవినీతికి చోటు లేదని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో జరిగిన సభలో సీఎం మాట్లాడారు. సింగరేణిలో కుంభకోణం జరిగిందని, బొగ్గు మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నాయని చెప్పారు. ఇవన్నీ పూర్తిగా అసత్యాలేనని ఖండించారు. కోల్ మైనింగ్ టెండర్లు అనుభవం ఉన్న సంస్థలకే ఇస్తామని తెలిపారు. ఒక్క అణా పైసా కూడా దుర్వినియోగం జరగదని అన్నారు.
“మీ పంచాయితీల గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు. మా మంత్రులపై దుష్ప్రచారం చేయొద్దు. వార్తలు రాసే ముందు నా వివరణ అడగాలి. మీడియాకు వివరాలు ఇవ్వడానికి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను” అని రేవంత్‌రెడ్డి చెప్పారు. తన రాజకీయ ప్రయాణం తొలిసారి ఖమ్మం నుంచే ప్రారంభమైందని సీఎం గుర్తు చేసుకున్నారు. ఇరవై ఏళ్లుగా ఖమ్మం ప్రజలు తనను ఆదరిస్తున్నారని అన్నారు. ఆదివారం ఖమ్మం పర్యటనలో రూ.362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఎన్టీఆర్ రూ.2 కిలోల బియ్యం పథకం తీసుకొస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందిస్తోందని చెప్పారు. ఇది ఎన్టీఆర్ ఆశయాలకు నిజమైన నివాళి అని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక మూడు కోట్ల పదిహేను లక్షల మందికి సన్నబియ్యం అందుతున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు.
వైఎస్సార్ స్ఫూర్తితోనే పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని చెప్పారు. గత బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని వెల్లడించారు. సన్నబియ్యం పథకం ప్రారంభం, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం ఖమ్మం నుంచే జరిగాయని తెలిపారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.20 లక్షల కోట్ల ఆదాయం వచ్చినా పేదలకు న్యాయం జరగలేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పూర్తికాకముందే తమను గద్దె దింపాలని ప్రయత్నాలు జరిగాయని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకున్న వారి గురువు ఫామ్ హౌస్‌లో కూర్చుని కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రచారం సాగుతోందన్నారు.
సింగరేణి విషయంలో రెండేళ్ల పాలనలో ఒక్క అవకతవకకూ అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు. సమ్మక్క–సారక్క పనులు 100 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు. గత ముఖ్యమంత్రి ఏకపాత్రాభినయం చేశాడని విమర్శించారు. ప్రస్తుతం మంత్రులంతా సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 1130 గ్రామపంచాయతీలు ఉంటే, 790 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారని ఆరోపించారు. పేదలకు ఇళ్లు ఇవ్వని రాజకీయాన్ని ప్రజలు క్షమించరన్నారు. అభివృద్ధిని అడ్డుకునే బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా బొందపెట్టాలని హెచ్చరించారు. భద్రాచలానికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వంలో భద్రాచలంలో భూసేకరణ జరుగుతోందని చెప్పారు. అయోధ్య తరహాలో భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాల ద్వారా బీఆర్‌ఎస్‌కు బలం చేకూర్చొద్దని సూచించారు.


