
హైదరాబాద్ కు చేరిన తమిళనాడు ఎంఎల్ఏల క్యాంప్
కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు ఎంఎల్ఏలు హైదరాబాద్ చేరుకున్నారు
తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఫలితాలు వచ్చి శనివారానికి ఐదు రోజులు అవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటుకాలేదు. కారణం ఏమిటంటే 234 అసెంబ్లీ సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను ఏపార్టీ లేదా కూటమి చేరుకోకపోవటమే. ప్రభుత్వం ఏర్పాటుకోసం వివిధ పార్టీల మధ్య నెంబర్ గేమ్ జరుగుతోంది. అందుకనే పార్టీలు తమ ఎంఎల్ఏలతో క్యాంపులు నడుపుతున్నాయి. ఏఐఏడీఎంకే నాయకత్వం ఎంఎల్ఏలను, డీఎంకే నాయకత్వం కూడా తమ ఎంఎల్ఏలతో క్యాంప్ నిర్వహిస్తోంది. విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ ఎంఎల్ఏలు మహాబలిపురంలోకి రిసార్ట్స్ లో సేద తీరుతున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు ఎంఎల్ఏలు హైదరాబాద్ చేరుకున్నారు.
నిజానికి ఈఎంఎల్ఏలు శుక్రవారం రాత్రే హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడే కొద్దిరోజులు క్యాంపులో ఉండటానికే వచ్చారు. అయితే వీళ్ళు శంషాబాద్ లో విమానం దిగగానే అధిష్ఠానం నుండి వచ్చిన ఆదేశాల కారణంగా బెంగుళూరుకు వెళ్ళిపోయారు. కొద్దిగంటలు విమానాశ్రయంలోనే ఉండి మరో విమానంలో బెంగుళూరుకు చేరుకున్నారు. అయితే రాత్రికి రాత్రి ఏమైందో ఏమో ఈరోజు మధ్యాహ్నానికి ఐదుగురు ఎంఎల్ఏలు మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఐదుగురు ఎంఎల్ఏలు తమిళనాడులో నెంబర్ గేమ్ ఫైనల్ అయ్యేంతవరకు హైదరాబాదులోనే ఉంటారని సమాచారం.
నిజానికి 107 ఎంఎల్ఏల గెలుపుతో లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకేకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ ఆర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చుండాల్సింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎంఎల్ఏల మద్దతు చూపితే కాని ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వనని గట్టిగా తెగేసి చెబుతున్నారు. దాంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు విజయ్ నానా తంటాలు పడుతున్నాడు. విజయ్ కు మద్దతుగా ఐదుగురు ఎంఎల్ఏలున్న కాంగ్రెస్, నలుగురు ఎంఎల్ఏలున్న వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. అయినా ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ కు ఇంకా ఇద్దరు ఎంఎల్ఏలు అవసరం. వీసీకే పార్టీ మద్దతు విషయంలో నిముషానికి ఒక మాట మారుస్తుండటంతో ఎప్పుడేమవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు.
అందుకనే ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయం ఫైనల్ అయ్యేంతవరకు కాంగ్రెస్ తన ఎంఎల్ఏలను ముందుజాగ్రత్తగా తమిళనాడు నుండి హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. మరి ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ కు గవర్నర్ నుండి ఎప్పుడు ఆహ్వానం అందుతుంది అన్న విషయమే సస్పెన్సుగా మారింది.

