రేవంత్ ప్రభుత్వానికి ‘తన్హా’ షాక్(వీడియో)
ఈనెల 15వ తేదీనుండి ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించాల్సిన ఉచిత ఆరోగ్య పథకం మొదలుకాలేదు
ఈనెల 15వ తేదీనుండి ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించాల్సిన ఉచిత ఆరోగ్య పథకం మొదలుకాలేదు. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణ నెట్ వర్క్ హాస్పిటల్స్(తన్హా) ఉచిత వైద్యానికి నిరాకరించటమే. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి కుటుంబసభ్యులకు సుమారుగా 25 లక్షల మందికి ఉచితంగా వైద్యం అవసరమైతే ఆపరేషన్లను కూడా ఉచితంగా చేయటమే ఎంప్లాయి హెల్త్ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ స్కీమ్ అధికారికంగా జూలై 15వ తేదీనుండి ప్రారంభం అవ్వాల్సుంది. ఉద్యోగులు, పెన్షనర్ల నుండి ప్రభుత్వం జీతాలు, పెన్షన్ల నుండి 1.5శాతం కోత కూడా మొదలుపెట్టింది.
అయితే పథకం ప్రారంభానికి ముందు తన్హా హఠాత్తుగా ఉచిత వైద్యం సాధ్యంకాదని ప్రభుత్వానికి తెగేసిచెప్పింది. కారణం ఏమిటంటే తన్హాలోని సుమారు 340 ఆసుపత్రులకు గడచిన ఏడాదికి ప్రభుత్వం రు. 2,000 కోట్లు బకాయిలు పెట్టింది. బకాయిల విడుదల కోసం తన్హా ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా ఉపయోగం కనబడటంలేదు. అందుకనే ఉచిత వైద్యం సాధ్యంకాదని తన్హాలోని ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పేశాయి.
ఇప్పటికే పెన్షనర్ల బెనిఫిట్స్ ను, ఫీజు రీఎంబర్స్ మెంట్ రూపంలో వేలాది కోట్ల రూపాయలను రేవంత్ ప్రభుత్వం బకాయిలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే తన్హా కూడా బకాయిల కోసం పట్టుబట్టడంతో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇదే విషయాన్ని తన్హా అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహాను కలిసి వివరించారు. తన్హా తాజా నిర్ణయంతో రేవంత్ కు షాక్ తగిలిందనే చెప్పాలి.

