
ఢిల్లీలో బీసీల మెరుపు ధర్నా
మహిళా రిజర్వేషన్లలో 50శాతం ఓబీసీ మహిళలకు కేటాయించాలనే డిమాండ్ తో తెలంగాణలోని బీసీ సంఘాల నేతలు శుక్రవారం ఢిల్లీలో మెరుపు ధర్నా చేశారు
మహిళా రిజర్వేషన్లలో 50శాతం ఓబీసీ మహిళలకు కేటాయించాలనే డిమాండ్ తో తెలంగాణలోని బీసీ సంఘాల నేతలు శుక్రవారం ఢిల్లీలో మెరుపు ధర్నా చేశారు. పార్లమెంటు దగ్గరలో ఈరోజు మద్యాహ్నం డీలిమిటేషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, పెంచిన అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లను మహిళల పేర్లతో అగ్రవర్ణాలే దక్కించుకుంటాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ధర్నా సందర్భంగా డీలిమిటేషన్ పత్రాలను జాజుల చింపేశారు. దేశవ్యాప్తంగా కులగణన పూర్తిచేసి అందులో బీసీల జనాభా ఎంతో తేలిన తర్వాత రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. 33శాతం మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాల్సిందే అన్నారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రప్రభుత్వం ఆమోదిస్తే దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తామని జాజుల హెచ్చరించారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు మాట్లాడుతు బీసీ ప్రధానమంత్రి అయ్యుండీ నరేంద్రమోదీ బీసీలకు ద్రోహం చేస్తున్నట్లు మండిపడ్డారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా కల్పించకపోతే బీసీలు బీజేపీని క్షమించరు అని చెప్పారు. బీసీలకు బీజేపీ చేస్తున్న మోసాన్ని ఊరూరా తిరిగి వివరిస్తాము అని వార్నింగ్ ఇచ్చారు.
మహిళా బిల్లు పేరుతో బీసీలను రాజకీయంగా బీజేపీ తొక్కిపెట్టాలని చూస్తోందని బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, శ్రీనివాసగౌడ్ ఆరోపించారు. దేశంలోని 40 కోట్లమంది బీసీ మహిళల ఆక్రందనను కేంద్రప్రభుత్వం పట్టించుకోవటంలేదు అన్నారు. స్ధానికసంస్ధల్లో ఉన్నట్లే చట్టసభల్లో కూడా బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అని డిమాండ్ చేశారు. బీసీ మహిళలక రాజకీయ ప్రాతినిధ్యం పెంచకుండా డీలిమిటేషన్ చట్టం చేయటం ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. బీసీ హక్కుల కోసం బీసీ సంఘాలతో దేశవ్యాప్తంగా పోరాడుతామని చెప్పారు.

