వీబీజీ రామ్‌జీకి తెలంగాణ ఓకే.. కానీ సుప్రీంకోర్టులో పోరు!
x

వీబీజీ రామ్‌జీకి తెలంగాణ ఓకే.. కానీ సుప్రీంకోర్టులో పోరు!

వీబీజీ రామ్‌జీ చట్టాన్ని తెలంగాణ అమలు చేయనుంది. అయితే కేంద్ర నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.


వీబీజీ రామ్‌జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం డబుల్ స్టాండ్ తీసుకుంది. ఇతర రాష్ట్రాలు ఈ పథకం అమలుకు ఓకే చెప్పినట్లు అధికారులు చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా గత్యంతరం లేక జూలై 1 నుంచి ఈ పథకాన్ని ఆమోదించింది. మరోవైపు అదే చట్టంపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (VB-G RAM G Act) జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గురువారం జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా తీసుకొచ్చిన ఈ చట్టంలో పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. అలాగే రోజువారీ కూలీని రూ.300 నుంచి గరిష్ఠంగా రూ.409 వరకు నిర్ణయించగా, సిక్కింలోని కొన్ని పంచాయతీల్లో రూ.450 చెల్లించనున్నారు. తెలంగాణలో రోజువారీ వేతనాన్ని రూ.308, ఆంధ్రప్రదేశ్‌లో రూ.312గా కేంద్రం ప్రకటించింది.

అయితే రాష్ట్రాలను సంప్రదించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం ఫెడరల్ స్ఫూర్తికి, రాజ్యాంగ భావనకు విరుద్ధమని తెలంగాణ క్యాబినెట్ అభిప్రాయపడింది. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయొద్దని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులను పరిశీలించిన మంత్రివర్గం, రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే ఇతర రాష్ట్రాలన్నీ కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో, ఉపాధి హామీ కూలీలకు పనులు ఆగకుండా ఉండేందుకు తెలంగాణలో కూడా వీబీజీ రామ్‌జీ చట్టాన్ని అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. అదే సమయంలో చట్టంలోని నిబంధనలను సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో పాటు, పార్లమెంట్‌లోనూ కేంద్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించాలని నిర్ణయించింది. దీంతో వీబీజీ రామ్‌జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం అమలు, న్యాయపోరాటం రెండింటినీ ఒకేసారి కొనసాగించనుంది.

కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు

1. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో అందించే అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజ‌నాన్ని విద్యార్థుల‌తో పాటు ఉపాధ్యాయులు, లెక్చ‌ర‌ర్లు, సిబ్బందికి కూడా అందించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యించింది. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించే సంకల్పంతో పాటు జవాబుదారీతనం పెంచే ఆలోచనలో భాగంగా రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి ఈ పథకం వర్తింపజేయనుంది.

2. కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. స‌న‌త్ న‌గ‌ర్‌, ఎల్‌.బి.న‌గ‌ర్‌, అల్వాల్ టిమ్స్ తో పాటు వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు చేసింది. రోగుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు వీలుగా మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 1,494 రెగ్యుల‌ర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు, 4,235 ఔట్ సోర్సింగ్ పోస్టులకు అనుమతించారు. ఈ ఆసుప‌త్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక్కడ అందించే వైద్య సేవ‌ల‌కు సీఎం రిలిఫ్ ఫండ్ నుంచి LOC లు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు.

3. మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో భాగంగా ఫేజ్‌- I పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో 21 కిలోమీట‌ర్ల పొడవునా అభివృద్ధికి రూ.7,345.12 కోట్ల విలువైన ప‌నుల మంజూరుకు ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హిమాయ‌త్ సాగ‌ర్ నుంచి ఈసా... ఉస్మాన్ సాగ‌ర్ నుంచి మూసా ప్ర‌వాహాలు ప్రారంభ‌మ‌య్యే చోటు నుంచి బాఫూఘాట్ వరకు ఈ ప‌నులు చేప‌డ‌తారు. మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప‌నులు... నిర్వ‌హ‌ణ కోసం నూత‌నంగా 147 పోస్టుల క్రియేష‌న్‌తో పాటు ఇత‌ర శాఖ‌ల నుంచి అవ‌స‌ర‌మైన సిబ్బంది డిప్యూటేష‌న్‌కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

4. వ‌రంగ‌ల్ జిల్లా నెక్కొండ మండ‌లం బొల్లికుంట గ్రామంలో నిత్యావ‌స‌ర వ‌స్తువులు గోదాముల నిర్మాణానికి 50 ఎక‌రాల‌ను, రంగారెడ్డి జిల్లా క‌డ్తాల్ మండ‌లం క‌ర్కాల‌ప‌హాడ్ గ్రామంలో 10 ఎక‌రాల‌ను తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (Telangana state Warehousing corporation (TGSWC)) కు మార్కెట్ రేట్ ప్ర‌కారం కేటాయించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

5. జవహర్ నవోదయ విద్యాలయాలకు రెండు చోట్ల ప్రభుత్వం స్థలం కేటాయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడ‌లో 19.12 ఎక‌రాల‌ ప్రభుత్వ భూమిని క్యాబినెట్ కేటాయించింది. జగిత్యాల జిల్లా చ‌ల్‌గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది.

Read More
Next Story