
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. తెలంగాణ రియాక్షన్ ఇదే!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై తెలంగాణ రాజకీయ నేతలు స్పందించారు. విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయమని పలువురు అభిప్రాయపడ్డారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. విద్యార్థుల పోరాటం ఫలించిందని, ప్రజల ఒత్తిడే ఈ నిర్ణయానికి కారణమని వారు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం, సంస్కరణలు కోరుతూ నిరసనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ప్రజల శక్తే గొప్పదన్నారు: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే ఎప్పుడూ గొప్పదని పేర్కొన్నారు. చివర్లో "జెన్ జీ" అంటూ తన సందేశాన్ని ముగించారు.
యువత సాధించిన పెద్ద విజయం: హరీశ్ రావు
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా ఈ పరిణామంపై స్పందించారు. దేశ యువత సాధించిన గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. దేశ రాజకీయాల్లో మార్పు ప్రారంభమైన సంకేతమిదేనని అభిప్రాయపడ్డారు.
విద్యార్థి శక్తికి లభించిన గౌరవం: పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థులు ఐక్యంగా చేసిన పోరాటమే ఈ ఫలితాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ఇది ఒక వ్యక్తి రాజీనామా మాత్రమే కాదని చెప్పారు. అహంకార రాజకీయాలు విద్యార్థి శక్తి ముందు తలవంచిన సందర్భమని వ్యాఖ్యానించారు. ఈ పరిణామానికి ప్రతిపక్షాల నిరంతర ఒత్తిడి, ముఖ్యంగా రాహుల్ గాంధీ చేసిన పోరాటం కూడా కారణమని పేర్కొన్నారు.
ఎన్డీఏకు హెచ్చరిక: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రాజీనామాను ఎన్డీఏ ప్రభుత్వానికి ఆరంభ హెచ్చరికగా అభివర్ణించారు. యువత చేపట్టిన ఆందోళనల కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. విద్యార్థులకు ఇది పెద్ద విజయమని చెప్పారు. 2029 ఎన్నికల్లో ఈ పరిణామం రాజకీయ ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

