రేవంత్ హైడ్రా ‘హిడెన్ అజెండా’ ఇదేనా ?
x

రేవంత్ హైడ్రా ‘హిడెన్ అజెండా’ ఇదేనా ?


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటుచేసిన హైడ్రా హిడెన్ అజెండా ఏమిటనే విషయం బయటపడిందా ? భూముల అమ్మకంపైన ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటి తాజా సిఫారసుతో ఈ విషయంపై క్లారిటి వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే చెరువులు, కాల్వలతో పాటు ప్రభుత్వ భూముల ఆక్రమణలను కబ్జా కోరలనుండి హైడ్రా విడిపిస్తున్న విషయం తెలిసిందే. కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటన ప్రకారమే రు. 1.5 లక్షల కోట్ల విలువైన 3500 ఎకరాలను హైడ్రా తిరిగి ప్రభుత్వానికి చేర్చింది.

ఈ నేపధ్యంలోనే తాజాగా సమావేశమైన సబ్ కమిటి 2665 ఎకరాలను వేలంలో అమ్మాలని ప్రభుత్వానికి సిపారసుచేసింది. హైదరాబాద్ కు చుట్టుపక్కలే ఉన్న గాజుల రామారంలోని 317 ఎకరాల రాష్ట్ర ఫైనాన్స్ కార్పోరేషన్ భూములు, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని 840 ఎకరాల రెవిన్యు భూములు, ఇతర ప్రాంతాల్లోని రెవెన్యు, హెచ్ఎండిఏ, జిహెచ్ ఎం సి, ఇరిగేషన్ శాఖలకు చెందినవి 923 ఎకరాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రు. 70 వేల కోట్లుంటుందని సబ్ కమిటి అంచనా వేసింది.


కమిటి సూచనలమేరకు న్యాయపరంగా వివాదాలు తలెత్తని భూములను వేలంలో అమ్మేందుకు రేవంత్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే అప్పులు చేస్తేకాని ప్రభుత్వం నడవలేని పరిస్ధితిలో ఉందని స్వయంగా రేవంతే చాలాసార్లు చెప్పాడు. ప్రభుత్వ రాబడి రు. 18వేల కోట్లయితే జీతాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాల అమలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు సుమారు రు. 30 వేల కోట్లుగా రేవంత్ వివరించాడు. దీన్నిబట్టి నిధుల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్న విషయం తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే హైడ్రా రికవరీ చేసిన 3500 ఎకరాల్లో ప్రస్తుతానికి 2665 ఎకరాలను వేలంలో అమ్మితే రు. 70 వేల కోట్లు వస్తుంది కదా అన్న ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది.

వర్షం వస్తే వరదేనా ?

హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. దీనివల్ల వర్షాకాలంలో నగరంలో తీవ్ర వరద పరిస్ధితి కనబడుతోందనే చెప్పాలి. ఎందుకంటే నగరంలో ఉండే చెరువులు, నాలాలను బిల్డర్లు, రాజకీయనేతల మద్దతుదారులు కబ్జాలు చేసేసి నిర్మాణాలు చేసేయటమే. వర్షపు నీరు కాల్వల్లోకి వెళ్ళకుండా కబ్జాలు చేసిన కారణంగా వర్షపు నీరంతా కాల్వల్లోని డ్రైనేజీ నీటితో కలిసిపోయి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళల్లోకి వచ్చేస్తున్న విషయం తెలిసిందే. 2020లో వచ్చిన భారీ వరదలు నగరాన్ని ముంచెత్తి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఆ సమయంలో విపత్తు నిర్వహణ బృందాలమధ్య సరైన సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపిచింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ శాఖలమధ్య కూడా సమన్వయం లేదు. ఈ పరిస్థితులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని నిర్ణయించింది. అలాగే వరదలు వంటి విపత్తులను సమర్దవంతంగా ఎదుర్కోవాలని భావించింది. అందుకే ఈ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారంగా శక్తివంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనుకున్నది. అలా 2024, ఏప్రిల్ లో ఏర్పడిందే(హైడ్రా అంటే ఏమిటో ఫుల్ ఫామ్ రాయాలి) 'హైడ్రా'

తెలంగాణప్రభుత్వం 19 జూలై 2024న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న మొత్తం 'తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్' ప్రాంతాన్ని దీని అధికార పరిధిగా నిర్ణయించారు.

హైడ్రా బాధ్యతలు ఏమిటి ?

హైడ్రా బాధ్యతలు మూడుగా ఉంటాయి. మొదటిది, ఆస్తుల పరిరక్షణ విభాగం. దీని ద్వారా నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు, ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్లలో జరిగిన అక్రమ ఆక్రమణలను గుర్తించి తొలగించటంతో పాటు సంరక్షించటం. అలాగే పార్కులు, మైదానాలు, ఫుట్‌పాత్‌లు, రోడ్లతో పాటు ఇతర ప్రభుత్వ భూములను కబ్జాల నుండి పరిరక్షించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన భవనాలు, అనుమతి లేని ప్రకటనలపై చర్యలు తీసుకుంటుంది. రెండవది, విపత్తు నిర్వహణ విభాగం. దీని ద్వారా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయంతో హఠాత్తుగా వచ్చే ఈదురుగాలులు, భారీ వర్షాలు, వరదల సమయంలో తక్షణ ఉపశమన చర్యలు అందిస్తూ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ , స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, వాతావరణ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నగర భద్రతను పర్యవేక్షిస్తుంది. మూడవది, లాజిస్టిక్స్ & పోలీస్ స్టేషన్ విభాగం. దీని ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ అధికారాలను ఉపయోగించి ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తూ చట్టపరమైన విచారణలను, చర్యలను వేగవంతం చేస్తుంది.

హైడ్రా రాకముందు గ్రేటర్ హైదరాబాద్ మరియు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో చెరువుల ఆక్రమణలు తీవ్రస్థాయిలో ఉండేది. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ నిర్వహించిన ఒక సర్వే నిర్వహించింది. దీనిప్రకారం మొత్తం 920 చెరువులలో దాదాపు 491 చెరువులు పాక్షికంగానో లేదా పూర్తిగానో కబ్జాదారుల చేతుల్లోఉన్నాయి. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పూర్తిగా కబ్జా అయిన చెరువుల సంఖ్య 2014 నాటికి 182 ఉంటే, అది 2023 నాటికి 193కు పెరిగింది. బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో చెరువులు, నాలాల ఆక్రమణలు విపరీతంగా పెరిగాయనో ఆరోపణలున్నాయి. అలాగే జీహెచ్‌ఎంసీ, ఓఆర్ఆర్ మధ్య ప్రాంతంలో పూర్తిగా మాయమైన చెరువులు 62 నుండి 89కి పెరిగాయి. దశాబ్దాలుగా చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, నగరంలోని ప్రధాన నాలాల స్థలాలను కొందరు బిల్డర్లు, ఆక్రమణదారులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపటడం వల్లే ప్రతి వర్షాకాలంలో హైదరాబాద్ నగరంలో తీవ్ర వరద ముంపు సమస్య ఉత్పన్నమైంది.

కమిషనర్ నియామకం

జూలై 2024లో హైడ్రా కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ.వి.రంగానాథ్ ని ప్రభుత్వం నియమించింది. రంగానాథ్ 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణరాష్ట్రాల్లో వివిధ కీలక విభాగాలలో పనిచేశారు. కొత్తగూడెం ఓఎస్డీ, వరంగల్ కమిషనర్‌గా, నల్లగొండ ఎస్పీగా పని చేసారు.

హైడ్రా నగరంలోని చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములలోని అక్రమ నిర్మాణాలపై కఠినచర్యలు చేపట్టింది. ప్రారంభం నుండి చేపట్టిన వరుస కూల్చివేతలు ,ఆక్రమణల తొలగింపు చర్యల ద్వారా హైడ్రా ఇప్పటివరకు సుమారు 3,500 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని, చెరువుల స్థలాలను కబ్జాకోరల నుండి విడిపించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించింది. వీటిలో తుమ్మిడికుంట, సున్నం చెరువు, నల్ల చెరువు, బతుకమ్మకుంట వంటి ప్రముఖ నీటి వనరులకు చెందిన రూ. 450 ఎకరాలకు పైగా స్థలాలు ఉన్నాయి. ఈ విధంగా రక్షించిన భూముల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ. 1.5 లక్షల కోట్లని స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఎన్నో చెరువులను కబ్జాల నుండి విడిపించి హైడ్రా పునరుద్ధరించి, దానిచుట్టు వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేసి జనాలకు ఆహ్లాదాన్ని అందించింది.

దూకుడు ఎక్కువైన ఫలితం

కబ్జాలను విడిపించటం నిజమే కాని ఇదే సమయంలో దూకుడు కూడా ఎక్కువైపోయింది. ప్రభుత్వంలోని అన్నీ శాఖల దగ్గర అనుమతులు తీసుకుని 20, 30 ఏళ్ళ క్రితం నిర్మించిన అపార్ట్ మెంట్లను కూడా ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్లో ఉందనే కారణంగా కూల్చేయటం సంచలనంగా మారింది. కుకట్ పల్లి, నిజాంపేట ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లను హైడ్రా కూల్చేయటంతో వందలాది కుటుంబాలు రాత్రికి రాత్రి రోడ్డున పడటం సంచలనంగా మారింది. దాంతో హైడ్రా అంటే మండిపోయే బాధితులకు మద్దతుగా రాజకీయపార్టీలు రంగంలోకి దిగాయి. దాంతో హైడ్రాకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు రోడ్లపైకి వచ్చారు.

కొందరు బాధితులు దాఖలుచేసిన కేసులతో తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ దూకుడుపై తీవ్రంగా స్పందించింది. నోటీసులు ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా నివాసాలను కూల్చేయటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అయినా మరికొన్ని అపార్ట్ మెంట్లను హైడ్రా అలాగే కూల్చేసింది. దాంతో హైడ్రా కమిషనర్ పై కోర్టు థిక్కారం కేసులు నమోదయ్యాయి. కోర్టు ఎన్నిసార్లు సీరియస్‌గా వర్నింగ్ ఇచ్చినా కమిషనర్ తీరు మారలేదు. జూలై నెలలో శేరిలింగంపల్లి మండలం, కొండాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 1,2 లోని 40 ఎకరాల్లోని నిర్మాణాల విషయంలో హైకోర్టు స్టే ఉన్నా హైడ్రా పట్టించుకోలేదు. మొదటిసారి వార్నింగ్ ఇచ్చిన కోర్టు రెండోసారి కోర్టు థిక్కారం అప్పుడే కమిషనర్ ను కోర్టుకు పిలిపించి గంటలపాటు నిలబెట్టారు జస్టిస్ జూకంటి అనీల్ కుమార్. రెండుసార్లు కోర్టు ఆక్షేపించినా వినకుండా హైడ్రా మూడోసారి మళ్ళీ ప్రైవేటు బిల్డర్ల నిర్మాణాల్లోకి వెళ్ళి కూల్చేయటం మొదలుపెట్టింది. దాంతో హైకోర్టు బాగా సీరియస్ అయిపోయి కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్నారని, కోర్టుధిక్కరణకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఏవీ రంగనాథ్‌ను వెంటనే హైడ్రా కమిషనర్ బాధ్యతల నుండి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారి స్థాయి వ్యక్తే న్యాయస్థానం ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు తీవ్ర అసహనం మరియు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఒకే అధికారిపై స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడంపై న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.

కమిషనర్ స్పందన

హైకోర్టు ఆదేశాలపై స్పందించిన ఏవీ రంగనాథ్, తాము కబ్జాదారుల నుండి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, చెరువులను రక్షించేందుకు నిజాయితీగా పనిచేశామని తెలిపారు. ల్యాండ్‌మాఫియా, కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారని, 63 కోర్టుధిక్కరణ కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆయన వెల్లడించారు. మరోవైపు, చెరువుల ఆక్రమణలపై హైడ్రా పోరాటం కొనసాగుతుందని, హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

అయితే ఇప్పటివరకూ క్రమణల నుంచి భూములను కాపాడి పర్యావరణాన్ని సంరక్షించడమే హైడ్రా లక్ష్యంగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ మరోవైపు రికవరీ చేసిన భూములను వేలం వేయటం ద్వారా ప్రభుత్వ ఖజానాని నింపాలన్న ఆలోచన కూడా ఇపుడు స్పష్టం అవడంతో హైడ్రా ఏర్పాటు వెనుక రేవంత్ రెడ్డి అసలు ఉద్దేశ్యం ఖజానా నింపుకోవడమేనా అన్న చర్చలు పెరిగిపోతూ ఉన్నాయి.

Read More
Next Story