ముగ్గురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ‘వేటు’ ?
మండలిలో కూడా సభ్యులు మధు, నవీన్ పై చర్యలకు ముందుగా ఎథిక్స్ కమిటి నేతృత్వంలో విచారణ జరిపించాలని ఛైర్మన్ డిసైడ్ అయ్యారు
బీఆర్ఎస్ కు సంబంధించిన ముగ్గురు ప్రజా ప్రతినిధులపై వేటు ఖాయమని తేలిపోయింది. అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి, శాసనమండలిలో తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై విచారణ జరగటం ఖాయం. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బూతులు తిట్టినందుకు మధు, నవీన్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని అసెంబ్లీలో తీర్మానం చేసి స్పీకర్ ద్వారా మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రతిపాదన పంపారు.
ముందస్తు చర్యగా ఇద్దరు ఎంఎల్సీలను ఈ సెషన్ జరిగేవరకు మండలిలోకి అడుగుపెట్టేందుకు లేకుండా ఛైర్మన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ కడియం శ్రీహరిని విషయంలో గత సమావేశాల్లో సభలోనే అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఎథిక్స్ కమిటి విచారణ జరుపుతోంది. అదే పద్దతిలో మండలిలో కూడా సభ్యులు మధు, నవీన్ పై చర్యలకు ముందుగా ఎథిక్స్ కమిటి నేతృత్వంలో విచారణ జరిపించాలని ఛైర్మన్ డిసైడ్ అయ్యారు.
ముగ్గురు సభ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటే ముందుగా ప్రొసీజర్ ను ఫాలో అవ్వాల్సిందే అన్న ఆలోచనతో స్పీకర్, ఛైర్మన్ జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ పై వేటు వేసిన విషయం తెలిసిందే. ప్రొసీజర్ ఫాలో అవకుండా ఇద్దరు సభ్యులపై వేటు వేయటంపై సుప్రింకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అందుకనే ఇపుడు హడావుడిగా కాకుండా మెల్లిగానే అయినా ఏ విషయంలో కూడా న్యాయస్ధానంలో ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు పార్టీవర్గాల సమాచారం.

