
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు...ఆధిపత్యం కోసం ఆరాటం
ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు వర్గాలు : అమాత్యుల మధ్య ఆధిపత్య పోరు
ముగ్గురు మంత్రులు… మూడు క్యాంపులు
ఖమ్మం కాంగ్రెస్‌లో అధికారమే కాదు… ఆధిపత్య పోరు కూడా శిఖరానికి చేరింది. ఒకే పార్టీలో ముగ్గురు మంత్రులు ఉండటం జిల్లాకు వరమా… శాపమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి...ముగ్గురు కీలక నేతలు తమ తమ శక్తి కేంద్రాలను నిర్మించుకోవడంతో కాంగ్రెస్ కేడర్ మూడు ముక్కలైంది. అధికార పార్టీ అయినప్పటికీ అంతర్గత విభేదాలు బహిరంగంగా కనిపిస్తున్న పరిస్థితి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు మంత్రుల మధ్య వర్గపోరు రాజుకుంది.ఖమ్మం జిల్లాలోని అయిదు స్థానాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ముగ్గురికి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఒకే ఒరలో మూడు కత్తులు లాగా మారడంతో ముగ్గురు మంత్రుల మధ్య పొసగడం లేదు. వర్గ విబేధాలు, కుమ్ములాటలకు నిలయమైన ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు మంత్రులకు మూడు వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయారు.
ఎవరి పర్యటన వారిదే...
జిల్లా కేంద్రమైన ఖమ్మం అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ,మార్కెటింగ్, చేనేతశాఖల మంత్రిగా ఉన్నా, ఆగస్టు 15, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగురవేయడానికి పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కేటాయించారు. ఖమ్మంలో జెండా వందనం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. మరో వైపు రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖల మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకంటూ వర్గంతో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆగస్టు 15 వేడుకల్లో మాత్రం తాను ఇన్ చార్జీగా ఉన్న వరంగల్ జిల్లాలో పాల్గొంటున్నారు.ఖమ్మం జిల్లాలో ప్రతి మంత్రి తనకంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారిక వేడుకలకైనా ఒకే వేదికపై కనిపించకుండా వేర్వేరుగా పాల్గొనడం గమనార్హం. ఖమ్మంలో ఒక కార్యక్రమం ఉంటే, మరో మంత్రి వేరే జిల్లాలో ఉండటం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మూడు వర్గాలుగా కాంగ్రెస్ కార్యకర్తలు
ముగ్గురు మంత్రులు ఎవరికి వారే యమునా తీరేలా ఉండటంతో మూడు వర్గాలు కార్యకర్తలు వారి వారి పర్యటనల్లో పాల్గొంటున్నారు.జిల్లాకు ముగ్గురు మంత్రుల వరుస పర్యటనలతో జిల్లా అధికారులు సైతం సతమతమవుతున్నారు. జిల్లాలో సమస్యలపై ముగ్గురు మంత్రులు ఎవరికి వారు వేర్వేరుగా వచ్చి జిల్లా కలెక్టరు, జిల్లా పోలీసు కమిషనర్, వివిధ శాఖల అధికారులతో సమీక్షలు చేస్తుంటారు. ప్రోటోకాల్ పరంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కు జిల్లాలో ఆధిపత్యం చలాయిస్తున్నారు. మరో వైపు సీనియర్ మంత్రి అయిన తుమ్మల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినా, ఆయనకంటూ జిల్లా వ్యాప్తంగా అనుచరగణం ఉండటంతో సుడిగాలి పర్యటనలు చేస్తుంటారు. భద్రాచలం దేవాలయం అభివృద్ధి పనులు, సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను తుమ్మల పర్యవేక్షిస్తుంటారు. మరో వైపు రెవెన్యూమంత్రి అయిన పొంగులేటి కూడా భద్రాచలం పర్యటనలు చేస్తుంటారు. ఏ మంత్రి జిల్లా పర్యటనకు వస్తే ఆయా మంత్రుల అనుంగు అనుచరులు, ఆయన వర్గ కాంగ్రెస్ కార్యకర్తలు వారి వెంట వెళ్లి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. దీంతో ముగ్గురు మంత్రుల అధికారిక పర్యటనల్లో కార్యకర్తల సందడి కనిపిస్తుందని ఓ సీనియర్ మంత్రి కార్యాలయ సహాయకుడు చెప్పారు.
పదవుల కోసం కార్యకర్తల పోటీ
కాంగ్రెస్ పార్టీలో పదవులతో పాటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరికి వారు మూడు వర్గాలుగా విడిపోయారు. పదవుల పందేరంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి మాట చెల్లుబాటు అవుతుంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన తుమ్మల మాత్రం తన అనుచరులకు ఎలాంటి పదవులు కట్టబెట్టక పోవడంతో వారిలో అసంతృప్తి రాజుకుంది. మొదట టీడీపీలో ఉన్న తుమ్మల బీఆర్ఎస్ లో కొంత కాలం పనిచేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ లో చేరిన అనుచరులకు ఎలాంటి పదవులు దక్కక పోవడంతో వారిలో నైరాశ్యం నెలకొంది. పదవులన్నీ భట్టి, పొంగులేటి వర్గాలే తన్నుకుపోతుండటం తుమ్మల అనుచరులు రగిలిపోతున్నారు. తుమ్మల కూడా తన అనుచరులకు పదవులు ఇప్పించటానికి మొగ్గుచూపటం లేదు. తాము అనుంగు అనుచరుడిగా మంత్రి వెంట నడుస్తున్నా, తనకు నామినేటెడ్ పదవి దక్కలేదని ఓ మంత్రి అనుచరుడైన జిల్లా నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని నమ్ముకొని ఆయన వెంట నడచినా ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో తాను తిరిగి పాత పార్టీలోకి వెళ్లానని ఓ రైతు నాయకుడు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
వెలుగుమట్ల పట్టాల పంపిణీలో ముగ్గురు మంత్రులు
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో ప్రజాందోళనలు రాజుకున్నాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం వెలుగుమట్ల భూ నిర్వాసితుల్లో అర్హులైన 311 మందికి ఇళ్ల స్థల పట్టాలను పంపిణీ చేశారు. వెలుగుమట్ల మంత్రి తుమ్మలకు చెందిన సొంత నియోజకవర్గమైనా పట్టాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు వచ్చి పట్టాలను పంపిణీ చేశారు.
భద్రాచలంలోనూ ముగ్గురు మంత్రుల పర్యటనలు
మరో వైపు భద్రాచలం దేవాలయం అభివృద్ధికి మంత్రి తుమ్మల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి మాస్టర్ ప్లాన్ రూపొందించి సీఎం రేవంత్ రెడ్డితో శ్రీరామనవమి సందర్భంగా శంకుస్థాపన చేయించారు. అయితే దేవాలయం అభివృద్ధికి భూసేకరణతో పాటు మిగతా ప్రాజెక్టు పనులపై మంత్రి పొంగులేటి కూడా ప్రత్యేకంగా వచ్చి అధికారులతో సమీక్షించారు.మరో వైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా భద్రాచలంలో సందర్శించారు. జిల్లాలో కీలకమైన సీతారామ ప్రాజెక్టు పనులు మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేపట్టగా, ఈ కార్యక్రమంలోనూ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పాలుపంచుకున్నారు.
ముగ్గురు మంత్రుల అధికారిక సమీక్షలు
ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు వేర్వేరుగా వరుసపెట్టి జిల్లా అధికారిక పర్యటనలు చేస్తుండటంతో అధికారులు వాటి ఏర్పాట్లతో సతమతమవుతున్నారు. జిల్లాకు మంత్రి వచ్చినపుడల్లా జిల్లా కలెక్టరుతోపాటు పోలీసు కమిషనర్ హాజరు కావాల్సిందే. మరో వైపు వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముగ్గురు మంత్రులు వేర్వేరుగా సమీక్షలు చేస్తున్నారు. దీంతో ఈ సమీక్షల కోసం అధికారులు నివేదికలు రూపొందించడంతో పాటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రొటోకాల్ ప్రకారం మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినపుడల్లా అధికారులు జీ హుజూర్ అంటూ హాజరు అవుతున్నారు. ముగ్గురు మంత్రుల వరుస పర్యటనలతో తాము నిత్యం తీరికలేని పనులతో సతమతం అవుతున్నామని ప్రభుత్వ అధికారి ఒకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అధికారులకు తలనొప్పి
ముగ్గురు మంత్రులు వరుసగా జిల్లా పర్యటనలు చేయడంతో అధికారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రతి మంత్రి వేర్వేరుగా సమీక్షలు నిర్వహించడం వల్ల కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహా అన్ని శాఖల అధికారులు వరుస సమావేశాలతో సతమతమవుతున్నారు.
ఎంపీ రేణుకాచౌదరి హల్ చల్
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల మధ్య వర్గవిబేధాలు కొనసాగుతుండగా, మరో వైపు ఇటీవల రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన రేణుకాచౌదరి తాను ఖమ్మం ఆడపడచునంటూ తన అనుచరగణంతో పర్యటిస్తూ హల్ చల్ చేస్తుంటారు.తాజాగా రేణుకాచౌదరి భద్రాచలంలో సమరభేరి కార్యక్రమంలో ట్రాక్టరు నడిపారు. తన అనుంగు అనుచరులతో కలిసి రేణుకాచౌదరి సందడి చేశారు.ఖమ్మం లోక్ సభ ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి మంత్రి పొంగులేటికి సమీప బంధువు కావడంతో ఆయన పొంగులేటి వర్గంలో కొనసాగుతున్నారు. ఇలా వర్గవిభేదాలు, అంతర్గత కుమ్ములాటలతో ఖమ్మం కాంగ్రెస్ రాజకీయం సతమతమవుతుంది.
ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయం లోపిస్తే అభివృద్ధి పనులు వేగం కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వర్గపోరు ఇలాగే కొనసాగితే పార్టీ బలం క్రమంగా బలహీనపడే అవకాశాలు లేకపోలేదు. ఒకే జెండా కింద ఉన్న నాయకులు ఒకే దారిలో నడుస్తారా… లేక మూడు దారుల రాజకీయమే కొనసాగుతుందా అన్నది ఖమ్మం కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించనుంది.
Next Story

