
తెలంగాణలో బీజేపీ మొలకెత్తదు.. మోదీకి టీపీసీసీ చీఫ్ కౌంటర్..
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ప్రధాని మోదీ కల మాత్రమేనంటూ ఎద్దేవా.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అది కేవలం మోదీ కలగానే మిగిలిపోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితే లేదని, అది బీజేపీ వాళ్ల భ్రమ మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగానే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎలా గెలిచిందో అందరికీ తెలుసంటూ చురకలంటించారు. బెంగాల్‌లో సెక్యులర్ల ఓట్లను భారీ మొత్తంలో తొలగించే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అంతేకాకుండా నరేంద్ర మోదీ.. భారత ప్రధానిగా కాకుండా బీజేపీ ప్రధానిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చి అభివృద్ధి సహాయపడాల్సిన ప్రధాని, తెలంగాణకు వచ్చి కేవలం రాజకీయాలు మాట్లాడటం సబబు కాదని, ప్రజలకు కూడా ఇది రుచించదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అనుకూలంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంపూర్థ మెజారిటీతో కాంగ్రెస్ జెండా రెపరెపలాడటం ఖాయమని టీపీసీసీ చీఫ్ మమేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ బీజేపీ బలపడం జరగదని అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్‌ను చిత్తు చేసిన పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కాంగ్రెస్‌కు సమాన దూరంలో ఉంటాయని అన్నారు.

