
ప్రాధాన్యత కోసమే హరీష్ పాకులాడుతున్నారు: తుమ్మల
ఖమ్మంలో మంత్రి తుమ్మల వ్యాఖ్యలు చర్చనీయాంశం. బీఆర్ఎస్‌పై విమర్శలు, ప్రాజెక్టులపై ఆరోపణలు, రైతులకు నీటి హామీ వివరాలు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. మాజీ మంత్రి హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకత్వంపై తుమ్మల చేసిన వ్యాఖ్యలు ఖమ్మం రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీశాయి. గత ప్రభుత్వం అహంకార పాలన వల్లే రాష్ట్రం ఇప్పుడు తిప్పలు పడుతోందని తుమ్మల విమర్శించారు. ఈ సందర్భంగానే హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఆయన విమర్శల పదును పెంచారు. సొంత పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోవడంతో, దాని కోసం హరీష్ రావు నానాతిప్పలు పడుతున్నరని చురకలంటించారు. సొంతగూటిలో స్థానం క్షీణించడంతో దానిని బలపరుచుకునే పనిలో హరీష్ రావు ఫుల్ బిజీ అని ఎద్దేవా చేశారు.
సీతారామ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ, ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ నీరు అందించలేకపోయారని విమర్శించారు. కేంద్ర అనుమతులు లేకుండా ప్రాజెక్టును ముందుకు నడిపారని కూడా పేర్కొన్నారు. తాను లేని సమయంలో హడావుడిగా ప్రారంభించి ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిపారు. అయితే, జూన్ నాటికి 16 వేల ఎకరాలకు, పినపాకలో 10 వేల ఎకరాలకు నీరు అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కారణంగా రాష్ట్రం భారీ అప్పుల్లో పడిందని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని తెలిపారు. రుణమాఫీపై మాట్లాడుతూ, ప్రభుత్వం 21 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. దీనిపై విమర్శలు చేయడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఇంకా బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ప్రజలు అధికారానికి దూరం పెట్టినా మార్పు కనిపించలేదని విమర్శించారు.
సీతారామ ప్రాజెక్టు తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో ప్రాజెక్టు పనులు అనుమతులు లేకుండా జరిగాయని తెలిపారు. ప్రాజెక్టు రూపకల్పనలో లోపాలు ఉన్నాయని, అవసరమైన పనులు కాకుండా కమీషన్ల కోసం పనులు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌కు మళ్లించిందని, సత్తుపల్లి టన్నెల్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్నికల ముందు అనేక పనులు ప్రారంభించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
ప్రస్తుతం ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తోందని వివరించారు. మాజీ మంత్రి హరీష్ రావు హయాంలో వివిధ పథకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రజలు ఈ పరిస్థితిని గుర్తించి గత ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని తెలిపారు. చివరగా, ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తుందని పేర్కొన్నారు. విమర్శలను పట్టించుకోకుండా అభివృద్ధిపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు.

