
మూడుసార్లు విజయ్ ఫెయిల్యూర్ కు అసలు కారణాలివేనా ?
సినిమాలో రాజకీయాలకు నిజజీవితంలో రాజకీయాలకు తేడా ఏమిటో టీవీకే చీఫ్ విజయ్‌కు ఇపుడు స్పష్టంగా తెలిసొచ్చుంటుంది.
సినిమాలో రాజకీయాలకు నిజజీవితంలో రాజకీయాలకు తేడా ఏమిటో టీవీకే చీఫ్ విజయ్‌కు ఇపుడు స్పష్టంగా తెలిసొచ్చుంటుంది. సినిమాల్లో డైరెక్టర్, రచయిత లేదా హీరో తమకు కావాల్సినట్లుగా సన్నివేశాలను రెడీచేసుకుంటారు. సినిమాలో రాజకీయాలు ఎన్నిమలుపులు తిరిగినా చివరకు హీరో చెప్పినట్లుగానే ముగుస్తుంది. కానీ నిజజీవితంలో రాజకీయాలు ఏ ఒక్కరి చేతిలోను ఉండవు, ఏ ఒక్కరు చెప్పినట్లు నడవ్వు. నిముష నిముషానికి పరిస్ధితులను బట్టి రాజకీయాలు మారిపోతుంటాయి. అప్పటి పరిస్ధితులను బట్టి భవిష్యత్తును అంచనా వేసి ఎత్తులు వేసి ప్రత్యర్ధులను చిత్తు చేయగలిగిన వాళ్ళదే విజయం. ఇపుడు ఇదంతా ఎందుకంటే నిజజీవితంలో రాజకీయాలను అంచనా వేయటంలో విజయ్ పూర్తిగా ఫెయిలయ్యాడనే చెప్పాలి.
ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటానికి అవకాశం ఇవ్వాలని విజయ్ ఇప్పటికి మూడుసార్లు లోక్ భవన్‌కు వెళ్ళి మూడుసార్లూ ఫెయిలయ్యాడు. ఈనెల 4వ తేదీన వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి తనకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ ఆర్లేకర్ నుండి ఆహ్వానం అందటమే ఆలస్యం అన్నట్లుగా విజయ్ వ్యవహరించాడు. అయితే విజయ్‌కు షాక్ ఇచ్చేట్లుగా గవర్నర్ కుదరదు పొమ్మన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటుచేయటానికి పార్టీకి అయినా కూటమికి అయినా మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు. 234 సీట్లలో కూటమి లేదా పార్టీ మ్యాజిక్ ఫిగర్ 118 దాటితేనే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ నుండి ఆహ్వానం అందుతుంది.
మ్యాజిక్ ఫిగర్ లెక్కప్రకారం విజయ్ పార్టీ గెలిచింది 108 సీట్లలో మాత్రమే. అందులోను రెండుచోట్ల గెలిచిన విజయ్ తిరుచ్చి ఈస్ట్‌లో రాజీనామా చేయటంలో టీవీకే పార్టీకి ఉన్నది 107 సీట్లు మాత్రమే. ప్రోటెమ్ స్పీకర్ ను ఎన్నుకుని తన ద్వారానే అందరు ఎంఎల్ఏలుగా ప్రమాణస్వీకారం చేయాలి. సహజంగానే స్పీకర్ అయినా ప్రోటెమ్ స్పీకర్ అయినా అధికారపార్టీ నుండే ఉంటారు. ఈ లెక్కన ప్రోటెమ్ స్పీకర్ ను నియమించిన తర్వాత టీవీకే బలం 106కి పడిపోతుంది. ఈ లెక్కన విజయ్ ప్రభుత్వం ఏర్పాటుచేసి బలనిరూపణలో గెలవాలంటే ఇంకా 12 సీట్లు అవసరం. ఇప్పటికి విజయ్ గవర్నర్ మూడుసార్లు కలిసినా 118 మంది ఎంఎల్ఏల బలం చూపించమనే అడుగుతున్నారు. గవర్నర్ అడిగినట్లు తగినంత బలం చూపించటంలో విజయ్ మూడుసార్లూ ఫెయిలయ్యాడు.
107 నుండి 116కి పెరిగిన బలం
మొదటిసారి గవర్నర్ ను కలిసినపుడు విజయ్ చూపించిన బలం 107 మాత్రమే. రెండోసారి గవర్నర్ ను కలిసినపుడు విజయ్ చూపించిన బలం 112. ఈ 112 కూడా 5గురు ఎంఎల్ఏలున్న కాంగ్రెస్ మద్దతు పలకటంతో టీవీకే బలం 112కి పెరిగింది. మూడోసారి లోక్ భవన్ కు వెళ్ళినపుడు విజయ్ చూపించిన బలం 116. విజయ్‌కు 4 సీట్లున్న వామపక్షాలు మద్దతు ప్రకటించటంతో బలం 116కి పెరిగింది. అయితే మద్దతిస్తానని హామీ ఇచ్చిన వీసీకే పార్టీ చివరలో అడ్డంతరిగింది. వీసీకే పార్టీకి రెండుసీట్లున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎంఎల్ఏల బలం ఉందని విజయ్ అనుకున్నాడు. అయితే గొంతెమ్మకోరికలతో వీసీకే చివరినిముషంలో అడ్డం తిరగటంతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో టికెట్ తో పాటు డిప్యుటీ సీఎం పదవిని వీసీకే పార్టీ అడుగుతోందనే ప్రచారం పెరిగిపోతోంది.
వీసీకే డిమాండ్లకు అంగీకరించకపోతే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు. అలాగని డిమాండ్లను అంగీకరిస్తే రేపొద్దున వీసీకే పార్టీ ఇంకేమి కోరికలు కోరుతుందో అన్న ఆలోచనలో విజయ్ ఉన్నాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవటం కాదు తర్వాత మొదలైన అసలైన రాజకీయాలే విజయ్ ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఇతర పార్టీలను ఎలా కన్వీన్స్ చేయాలో అర్ధంకావటంలేదు.
నిజానికి విజయ్ వ్యవహార శైలిలో కూడా తప్పులున్నాయని సమాచారం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తన పార్టీ నిలవగానే ఇతర పార్టీలు పోలోమంటు వచ్చి తనకు మద్దతిచ్చేస్తాయని విజయ్ భ్రమపడ్డాడు. అయితే ఎవరూ తన దగ్గరకు రాకపోయేసరికి మద్దతుకోరుతు కాంగ్రెస్, వామపక్షాలకు వాట్సప్ లో సమాచారం పంపినట్లు తెలిసింది. తనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరుతు విజయ్ లోక్ భవన్ కు మెయిల్ పెట్టాడని సమాచారం. మెయిల్ చూసుకున్న గవర్నర్ లైట్ తీసుకున్నారు. విజయ్ నుండి మద్దతుకోరుతు వాట్సప్‌లో వచ్చిన సమాచారాన్ని కూడా కాంగ్రెస్, వామపక్షాలు ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో విషయం అర్ధంకాని విజయ్ మరుసటి రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫోన్లో మాట్లాడాడు.
కాంగ్రెస్ వల్లే 9 మంది ఎంఎల్ఏల మద్దతు
రాహుల్ తో మాట్లాడిన తర్వాత కాని విజయ్ కు తానుచేసిన తప్పేమిటో అర్ధంకాలేదు. వెంటనే తమిళనాడు కాంగ్రెస్ చీఫ్‌తో కూడా ఫోన్లో మాట్లాడాడు. తర్వాత పార్టీలో మాట్లాడుకున్న కాంగ్రెస్ నేతలు చివరకు విజయ్‌కు మద్దతిస్తున్నట్లు నిర్ణయం తీసుకుని అదే విషయాన్ని ప్రకటించారు. వెంటనే కాంగ్రెస్ ఎంఎల్ఏలను కలిసిన విజయ్ వామపక్షాలను ఒప్పించే బాధ్యతను కూడా కాంగ్రెస్ మీదే ఉంచాడు. అప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగి వామపక్షాల కీలకనేతలతో మాట్లాడారు. అంతకుముందు వరకు విజయ్ కు మద్దతిచ్చే ప్రసక్తేలేదని తేల్చిచెప్పిన వామపక్షాలు తర్వాత మెత్తపడ్డాయి. కారణం ఏమిటంటే ఖర్గే జోక్యం చేసుకుని వామపక్షాల కీలకనేతలతో మాట్లాడి తమిళనాడులో రెండుపార్టీల ఎంఎల్ఏలతో మాట్లాడి మద్దతు ఇవ్వటానికి ఒప్పించటమే. ఖర్గే మాట్లాడిన తర్వాత కాని విజయ్‌కు వామపక్షాలు మద్దతు ప్రకటించలేదు.
అంటే దీన్నిబట్టి ఏమర్ధమవుతున్నది అంటే సినిమాల్లో జరిగినట్లే నిజజీవితంలో కూడా జరిగిపోతుందని విజయ్ పెద్ద భ్రమల్లో ఉన్నాడని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ తరపున మీడియాకు సమాచారం ఇచ్చే వ్యవస్ధను కూడా విజయ్ ఏర్పాటు చేసుకోలేదు. అందుకనే మీడియా కూడా ఎవరికి తెలిసిన సమాచారాన్ని అవి ఇచ్చేస్తున్నాయి. అన్నీ పార్టీలకు మీడియాతో మాట్లాడేందుకు కీలకనేతలున్నారు ఒక్క టీవీకే పార్టీకి తప్ప. సో, ఇపుడు విషయం ఏమిటంటే వీసీకే పార్టీని ఒప్పిస్తేనే ప్రభుత్వం ఏర్పాటుచేయటానికి విజయ్‌కు అవకాశం దక్కుతుంది. లేదంటే ఇంకేదైనా అద్భుతం జరగాల్సిందే తప్ప వేరేదారిలేదు.

