ఇద్దరు బీఆర్ఎస్ ఎంఎల్సీల సస్పెన్షన్
వీరిపై కఠిన చర్యలు తీసుకునే విషయంలో బుధవారం శాసనమండలిలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ ఎంఎల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని కౌన్సిల్ నుండి సస్పెండ్ చేసినట్లు ఛైర్మన్ ఆఫీసు ప్రకటించింది. వీరిపై కఠిన చర్యలు తీసుకునే విషయంలో బుధవారం శాసనమండలిలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఊహించని, వివాదాస్పద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తమను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్కు చెందిన ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేశారు. స్పీకర్ తమను సభలోకి అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదావేసింది.
మరోవైపు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్లచొక్కాలు ధరించి, ప్లకార్డులతో అసెంబ్లీ హాలులోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈఘటనలో కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కిందపడటంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ ఎంఎల్ఏలు కూడా బీఆర్ఎస్ సభ్యుల అనుచిత వైఖరిపై మహిళా కమిషన్ కు, ఎస్సీ నేత, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బూతులు తిట్టినందుకు తాతా మధుపైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీ వ్యవహారాలపై గతంలో ఏ పార్టీ కూడా హైకోర్టులో కేసు దాఖలుచేయటం, హక్కుల కమిషన్లలో ఫిర్యాదులు చేయలేదు. ఇలాంటి సంప్రదాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే భీజం పడింది. స్పీకర్ ను బూతులు తిట్టిన బీఆర్ఎస్ ఎంఎల్సీ మధుతో పాటు మరో ఎంఎల్సీ నవీన్ కుమార్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానంచేయటం గమనార్హం.

