
సింగరేణి నష్టాలపై సీబీఐ దర్యాప్తుకు కేంద్రం రెడీ
బీఆర్ఎస్ వేసిన అవినీతి మార్గంలోనే కాంగ్రెస్ కూడా నడుస్తోందన్న కిషన్ రెడ్డి.
సింగరేణి చుట్టూ చాలా కుట్రలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హాయంలో జరిగినట్లే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా సింగరేణిలో అవినీతి తాండవిస్తోందన్నారు. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు జరిపించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇదే అంశంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలో సమావేశం జరిగింది. రాష్ట్ర కమిటీల పనితీరును సమీక్షించి, సభ్యులకు బాధ్యతలు కేటాయించడం, నాలుగు నెలల ఫలితాలను పరిశీలించడం ప్రధాన అంశంగా నిలిచింది. రానున్న మున్సిపల్ ఎన్నికలకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చ జరిగింది.
సింగరేణి, నైనీ కోల్ బ్లాక్‌ల విషయంలో కేంద్రం సీబీఐ దర్యాప్తుకు సిద్ధంగా ఉందని రాంచందర్ రావు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమాలు, అవినీతిని సీబీఐ వెలికితీయాలని బీజేపీ డిమాండ్ చేసింది. గతంలో దావోస్ పర్యటనలో ప్రకటించిన పెట్టుబడులు ఎక్కడ ఉపయోగించబడ్డాయో, ఎంతమంది ఉద్యోగాలు లభించాయో ప్రజలకు చూపించాలన్న సవాల్ విసిరారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి 136 ఏళ్ల చరిత్ర, తెలంగాణ ఉద్యమంలో కార్మికుల వీరోచిత పోరాటం, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్రను వివరించారు. నష్టాలు ఎందుకు వచ్చాయో, ఖర్చులు పెరిగినట్టు, ఆదాయం తగ్గినట్టు, ప్రైవేట్ కంపెనీలకు టెండర్లు కేటాయించడం వంటి అంశాలను విమర్శించారు.
బీజేపీ సీనియర్ నేతల అభిప్రాయంలో సింగరేణి భవిష్యత్తు, ఆర్థిక సంక్షోభం, జీతాల జాప్యాలు పక్కన పెట్టి కూడా, కార్మికుల హక్కులను కాపాడేలా సీబీఐ ద్వారా పూర్తిగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా, సమర్థవంతంగా సింగరేణి భవిష్యత్తుకు చర్యలు తీసుకుంటుందనే భరోసా ఇచ్చారు. సింగరేణి ఏ కుటుంబానికి చెందింది కాదు. ఇది కార్మికుల చెమట, రక్తంతో నిర్మితమైన ఆస్తి. దాని భవిష్యత్తుతో ఆడటం చరిత్ర క్షమించదు అని బీజేపీ స్పష్టం చేసింది.


