తమిళనాడులో భారీ మార్పు.. TVK దే  పీఠం
x

తమిళనాడులో భారీ మార్పు.. TVK దే పీఠం

విజయ్ డబుల్ విక్టరీ.. స్టాలిన్ ఓటమి.


తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మార్పు కనిపిస్తోంది. తాజా ఫలితాల ప్రకారం తమిళగా వెట్రి కళగం (TVK) భారీ ఆధిక్యంతో ముందంజలో నిలిచింది. ఇప్పటివరకు వచ్చిన లెక్కల్లోనే TVK ప్రధాన శక్తిగా అవతరించడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దశకు సంకేతంగా మారింది. టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల అధికారిని కలిసి.. విజయ ధృవీకరణ పత్రం కూడా అందుకున్నారు.

ఉదయం నుంచి మారిన ట్రెండ్

కౌంటింగ్ ప్రారంభంలో పోటీ సమంగా సాగినట్టు కనిపించింది. కానీ మధ్యాహ్నానికి చేరేసరికి TVK క్రమంగా ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత గంటలకొద్దీ తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ స్పష్టమైన లీడ్ సాధించింది.

విజయ్ ఘన విజయం

టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్.. పెరంబూర్ నియోజకవర్గంలో 1,20,365 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయనకు 53,715 ఓట్ల మెజారిటీ వచ్చింది.ఆయన ప్రత్యర్థి డీఎంకేకు చెందిన ఆర్.డి. శేఖర్ 66,650 ఓట్లు సాధించగా, పీఎంకే అభ్యర్థి ఎం. తిలగబామా 8,561 ఓట్లతో వెనుకబడ్డారు.

ఇంకో స్థానం తిరుచ్చీలో కూడా విజయ్ 91,381 ఓట్లు సాధించి గెలిచారు. అక్కడ ఆయనకు 27,416 ఓట్ల ఆధిక్యం లభించింది. డీఎంకే అభ్యర్థి ఎస్. ఇనిగో ఇరుదయరాజ్ 63,965 ఓట్లు పొందగా, ఏఐఏడీఎంకే అభ్యర్థి జి. రాజశేఖరన్ 19,715 ఓట్లతో నిలిచారు.

ఉదయనిధి స్టాలిన్ విజయం

డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్.. చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గంలో.. 62,992 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయనకు 7,140 ఓట్ల మెజారిటీ వచ్చింది.TVK అభ్యర్థి సెల్వం డి 55,852 ఓట్లు సాధించగా, ఏఐఏడీఎంకే అభ్యర్థి ఆదిరాజారం 16,507 ఓట్లతో వెనుకబడ్డారు.

స్టాలిన్‌కు షాక్

డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. కొలత్తూర్ నుంచి పోటీ చేసిన ఆయన ఆయన 74,202 ఓట్లు సాధించినా, TVK అభ్యర్థి వి.ఎస్. బాబు 82,997 ఓట్లు సాధించి 8,795 ఓట్ల తేడాతో గెలిచారు. ఏఐఏడీఎంకే అభ్యర్థి పి. సంతాన కృష్ణన్ 18,430 ఓట్లు పొందారు.

పార్టీ వారీగా ఫలితాలు

ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం..

TVK: 98 గెలుపు, 9 లీడ్ (మొత్తం 107)

DMK: 56 గెలుపు, 4 లీడ్ (మొత్తం 60)

AIADMK: 45 గెలుపు, 2 లీడ్ (మొత్తం 47)

ఇతర పార్టీలు కూడా కొన్ని స్థానాల్లో గెలిచాయి. మొత్తం 234 స్థానాల్లో 217 ఫలితాలు వచ్చాయి. 17 స్థానాల్లో ఇంకా లీడింగ్ కొనసాగుతోంది.

సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

విజయ్ విజయంపై సినీ ప్రముఖులు స్పందించారు. రజనీకాంత్, కమల్ హాసన్, శివకార్తికేయన్, ధనుష్ వంటి వారు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ప్రజల విశ్వాసాన్ని పొందారని, మొదటి ఎన్నికలోనే భారీ ప్రభావం చూపారని పేర్కొన్నట్లు సమాచారం.

ప్రజల తీర్పును స్వీకరిస్తాం: స్టాలిన్

ఫలితాలపై ఎం.కే. స్టాలిన్ స్పందిస్తూ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. గతంలో సాధించిన విజయాలే కాకుండా ఓటములను కూడా అంగీకరిస్తూ, ఇకపై ప్రతిపక్షంగా కూడా బాధ్యతగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.

Read More
Next Story