ఘోష్ రిపోర్టుతో రేవంత్ ఏం చేద్దామని అనుకుంటున్నాడు ?
x

ఘోష్ రిపోర్టుతో రేవంత్ ఏం చేద్దామని అనుకుంటున్నాడు ?

కమిషన్ రిపోర్టు న్యాయవిచారణలో నిలవదన్న విషయం రేవంత్ కు ముందే తెలుసా ? తెలీదా ? అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మీద బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై దాదాపు ఏడాదిన్నర కాలం వందలమందిని విచారించి తయారుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషర్ రిపోర్టును ఒక్కదెబ్బతో హైకోర్టు కొట్టిపడేసింది. ఈ రిపోర్టు ఆధారంగా కేసీఆర్, హరీష్ తదితరులపై ఎలాంటి యాక్షన్ తీసుకునేందుకు లేదని తేల్చి చెప్పింది. అంటే కమిషన్ పైన ప్రభుత్వం ఏడాదిపాటు చేసిన ఖర్చంతా గోదావరిలో పోసినట్లుగానే అయిపోయింది. డబ్బుతో పాటు విలువైన ఏడాదిన్నర కాలం కూడా వృధా అయిపోయింది. హైకోర్టు తీర్పు నేపధ్యంలో మరిపుడు ఘోష్ రిపోర్టును పెట్టుకుని రేవంత్ ఏమి చేద్దామని అనుకుంటున్నాడు ?

గురువారం సాయంత్రం జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశం మీద కూడా చర్చ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే ఏమి చర్చించినా, ఎంత చర్చించినా ఘోష్ కమిషన్ రిపోర్టయితే వృధా అయిపోయినట్లే లెక్క. ఎలాగంటే ఈ రిపోర్టును ప్రభుత్వం ఏ విధంగా కూడా ఉపయోగించుకునే అవకాశంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం అనుకుంటే మళ్ళీ మరో కమిషన్ వేయాల్సిందే. మళ్ళీ ఆ కమిషన్ లేదా కమిటి అందరినీ విచారించాల్సిందే. కమిషన్ విచారణలో జరిగిన తప్పులను గమనించి ఆ తప్పులు పునరావృతంకాకుండా కమిషన్ లేదా కమిటి జాగ్రత్తలు తీసుకోవాలి. అందరినీ విచారించి, రిపోర్టు తయారుచేసి ప్రభుత్వానికి అందించేటప్పటికి పుణ్యకాలం పూర్తయిపోవటం ఖాయం.

అంటే 2028/29 ఎన్నికల్లోగా రెండో రిపోర్టు ప్రభుత్వానికి అందుతుందా ? ఒకవేళ అందినా దాని అధారంగా ప్రభుత్వం ఎవరిపైనా యాక్షన్ తీసుకునేందుకు ఉండదు. ఎందుకంటే రిపోర్టు ప్రభుత్వానికి చేరగానే, అసెంబ్లీలో చర్చకుపెట్టగానే వెంటనే కేసీఆర్, హరీష్ తదితరులు ఆ రిపోర్టు మీద కూడా అభ్యంతరాలు వ్యక్తంచేస్తు కోర్టులో కేసులు వేస్తారు. ప్రభుత్వం తమపై కక్షసాధింపులకు దిగిందని, కమిషన్లు, కేసుల పేరుతో వేధిస్తోందని కేసీఆర్, హరీష్ తదితరులు వాదిస్తారు. అప్పుడు వ్యవహారం ‘రెడ్డొచ్చె మొదలెట్టే’ అనే సామెతలాగ మళ్ళీ మొదటికే వస్తుంది. సో, ఇపుడు జరగుతున్నది చూస్తుంటే కాళేశ్వరం రిపోర్టు గోదావరిలో కలిసిపోయినట్లే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇక్కడే కొన్ని అనుమానాలు పెరిగిపోతున్నాయి. అవేమిటంటే రిపోర్టు తయారుచేసిన పీసీ ఘోష్ కు తాను తయారుచేసిన రిపోర్టు కోర్టులో చెల్లదని తెలీదా ? తన రిపోర్టు ఆధారంగా ఎవరిపైనా చర్యలు తీసుకోవటానికి కోర్టు అనుమతించదు అన్న విషయం తెలీకుండానే ఉంటుందా ? కమిషన్ రిపోర్టును అడ్వకేట్ జనరల్ లేదా న్యాయనిపుణులు చదవలేదా ? రిపోర్టులోని అంశాల ఆధారంగా కేసీఆర్, హరీష్ తదితరులపై చర్యలు తీసుకోవటానికి హైకోర్టు అనుమతించదు అన్నవిషయంలో అనుమానాలు రాలేదా ? పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు కోర్టులో నిలబడదనే కొంచెం అనుమానం కూడా అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణులకు రాలేదా ? రిపోర్టులోని అంశాలు కోర్టు విచారణలో నిలబడుతాయా లేదా అన్నవిషయం ఎవరూ రేవంత్ రెడ్డికి చెప్పలేదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కమిషన్ రిపోర్టు న్యాయవిచారణలో నిలవదన్న విషయం రేవంత్ కు ముందే తెలుసా ? తెలీదా ? అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్.

ఘోష్ కమిషన్ కాలపరిమితిని పెంచటమో లేదా ఆ ప్లేసులో మరో కమిషన్/కమిటి వేసే విషయంపై ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. చర్చ జరపటానికి సూచనలు, సలహాలు ఇవ్వటానికే అడ్వకేట్ జనరల్ ను కూడా క్యాబినెట్ సమావేశానికి పిలిపించమని రేవంత్ ఉన్నతాధికారులను ఆదేశించారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే అడ్వకేట్ జనరల్ ఏమని సలహా ఇస్తారు ? ఏమి సూచిస్తారు ? ప్రభుత్వం తరపు వాదనలన్నీ వీగిపోతేనే కదా ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ కొత్తగా కమిషన్ రిపోర్టు విషయంలో అడ్వకేట్ జనరల్ ఇవ్వబోయే సలహాలు ఏముంటాయి ? సూచనలు ఏముంటాయి ?

బీజేపీ ఆరోపణలు నిజమేనా ?

ఇక్కడే రేవంత్-కమిషన్ రిపోర్టుపై బీజేపీ నేతల ఆరోపణలు నిజమేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మెదక్ ఎంపీ రఘునందనరావు మాట్లాడుతు కేసీఆర్-రేవంత్ మధ్య డూప్ ఫైటింగ్ నడుస్తోంది అని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి, అవకతవకలకు బాధ్యులపై రేవంత్‌లో చిత్తశుద్ది లేదనేందుకు హైకోర్టు తీర్పే ఉదాహరణగా నిలిచిందని ఎంపీ ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతు రేవంత్-కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని తాము ఎప్పటినుండో చేస్తున్న ఆరోపణలకు హైకోర్టు తీర్పే ఆధారమన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోలేని విధంగా జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టు తయారుచేయటంలో ఉద్దేశ్యం ఏమిటని కిషన్ నిలదీశారు. రేవంత్ ప్రభుత్వం అసమర్ధతకు ఇదే నిదర్శనం అని అన్నారు.

మరో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతు రేవంత్-కేసీఆర్ మధ్య లాలూచీ రాజకీయాలు నడుస్తున్నాయన్న తమ ఆరోపణలకు ఇంతకన్నా ఏమి ఆధారాలు కావాలని మండిపడ్డారు. కోర్టులో వీగిపోయేట్లుగా కమిషన్ రిపోర్టు ఎందుకు ఇచ్చిందో రేవంత్ సమాధానం చెప్పాలని బండి డిమాండ్ చేశారు. వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారని కాదుకాని ఆరోపణలే నిజమా అనే అనుమానాలైతే పెరిగిపోతున్నాయి. కేసీఆర్ తదితరులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రేవంత్‌కు నిజంగానే చిత్తశుద్ది ఉంటే రిపోర్టును కోర్టుకు సబ్మిట్ చేసేముందే పకడ్బందీగా ఎందుకు తయారుచేయలేదు అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. దశాబ్దాల పాటు జడ్జీగా ఉండి ఎంతో అనుభవం ఉన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు హైకోర్టులో వీగిపోయేంత బలహీనంగా ఉందంటే అందుకు కారకులు ఎవరు ? అన్నదే తేలాలి.

Read More
Next Story